దుబ్బాక, డిసెంబర్ 26: గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. రెండేండ్లుగా క్రీడా ప్రాంగణాల నిర్వహణ సక్రమంగా లేక నిరుపయోగంగా మారాయి. ఆయా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు పశువుల కొట్టాలుగా, మరికొన్ని గ్రామాల్లో ట్రాక్టర్లు తదితర వాహనాలకు నిలయాలుగా మారాయి. వ్యవసాయ పనుల కోసం, ధాన్యం నూర్పిళ్లకు క్రీడా ప్రాంగణాలు వినియోగిస్తున్నారు. క్రీడలతో సందడిగా ఉండే క్రీడా ప్రాంగణాలు పిచ్చి మొక్కలు, బురద, గుంతలతో అధ్వానంగా మారాయి. పలుచోట్ల క్రీడా ప్రాంగణాల స్థలం కబ్జాకు గురైంది. గ్రామీణ క్రీడాకారులకు క్రీడలు అందని ద్రాక్షగానే మారాయి.
యువత క్రీడల్లో రాణించేందుకు కేసీఆర్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడా ప్రాంగణాలు నిత్యం క్రీడాకారులతో సందడిగా ఉండేవి. కాంగ్రెస్ సర్కారులో ఆటలు లేక నిరుపయోగంగా మారాయి. పర్యవేక్షణ లేక ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం పంచాయతీలకు నూతన పాలకవర్గాలు ఏర్పాటు జరిగినందున క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాకారులు, గ్రామీణ యువకులు కోరుతున్నారు.
బీఆర్ఎస్ సర్కారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో 140 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. ఒక్కో గ్రామ పంచాయతీలో రూ. 2 లక్షలు ఖర్చుచేసి మైదానాల్లో క్రీడా పరికరాలు ఏర్పాటు చేశారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణను పట్టించుకునే నాథుడు లేక ప్రధాన సమస్యగా మారింది. క్రీడలతో సందడిగా ఉండే ప్రాంగణాలు పశువులు, కీటకాలకు నిలయాలుగా మారాయి. క్రీడా కిట్లు , ఇతర పరికరాలు లేక క్రీడాకారులు ఆటలకు దూరమవుతున్నారు. వాలీబాల్ కోర్టు, రన్నింగ్ ట్రాక్‌లో సౌకర్యాలు కరువయ్యాయి. ఏండ్ల తరబడి క్రీడా ప్రాంగణాల్లో క్రీడలు ఆడక అందులో ఉన్న పరికరాలు సైతం తుప్పు పట్టిపోతున్నాయి. మరికొన్ని చోట్ల పరికరాలను దొంగలు చోరీ చేశారు. దీంతో క్రీడాప్రాంగణాలు వెలవెలబోతున్నాయి.