మెదక్, మార్చి 20(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో కీలకమైన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు ఘనపూర్ వనదుర్గా ఆనకట్ట ఎత్తు పెంపునకు రాష్ర్ట బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. ఘనపూర్ ఆనకట్ట కింద సుమారు 40 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఘనపూర్ ఆనకట్ట మరమ్మతులు, ఆనకట్ట ఎత్తు పెంచాలని, సాగునీటి కాలువల ఆధునీకరణ చేయాలని రైతుల నుంచి డిమాండ్లు ఉన్నాయి.
కానీ, ఈ బడ్జెట్లో నిధులు మంజూరు చేయకపోవడంతో సాగుపై ప్రభావం చూపనున్నది. సింగూర్ ప్రాజెక్టు రివిట్మెంట్ మరమ్మతుల దృష్ట్యా ఘనపూర్ ఆనకట్టకు నీటిని విడుదల చేయలేదు. దీంతో ఆనకట్టలో నీటిమట్టం తగ్గింది. సాగునీటి కాలువల్లో నీరులేక బోసిపోయి కనిపిస్తున్నాయి. యాసంగి పంటలు ఎండిపోతుండడంతో ఆయకట్టు రైతులు కాపాడుకునేందుకు ఆందోళన చెందుతున్నారు. కేవలం ఫతేనహర్ కాల్వ నిర్వహణకు రూ.20.50 లక్షల నిధులు కేటాయించింది.
బీఆర్ఎస్ పాలనలో ఘనపూర్ ఆనకట్ట అభివృద్ధికి అప్పటి సీఎం కేసీఆర్ ప్రధాన్యమిచ్చారు. పాపన్నపేట, కొల్చారం, మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లోని ఆయకట్టు భూములకు సాగునీరు అందించేందుకు ఎంతగానో కృషిచేశారు. సింగూర్ ప్రాజెక్టు ద్వారా ఏటా వానకాలం, యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు ఘనపూర్ ఆనకట్టకు నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు ధీమాగా పంటలు పండించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగూర్ ప్రాజెక్టుకు మరమ్మతుల పేరిట రెండేండ్లుగా కాలయాపన చేస్తున్నది.
సింగూరు ప్రాజెక్టు నీటిని ఘనపూర్ ఆనకట్టకు విడుదల చేయకపోవడంతో పంటలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆయకట్టు రైతులు రెండు పంటలు కోల్పోయారు. 2014 డిసెంబర్ 17న మాజీ సీఎం కేసీఆర్ ఘనపూర్ ఆయకట్టును సందర్శించి రూ. 50 కోట్లు మంజూరు చేశారు. ఘనపూర్ ఆనకట్టకు ఏడుపాయల దుర్గమ్మ పేరిట వనదుర్గ్గా ప్రాజెక్టుగా నామకరణం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఘనపూర్ ప్రాజెక్టుకు రూ.43.64 కోట్లు మంజారు చేసింది. ప్రాజెక్టు కట్ట ఎత్తుతో పాటు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.100 కోట్లు మంజూరు చేసింది.
ఆ తర్వాత ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఘనపూర్ ప్రాజెక్టు మరమ్మతులు, కట్ట ఎత్తు పెంచే పనులు పెండింగ్లో పడిపోయాయి. ఘనపూర్ ఆయకట్టకు కుడి కాలువ ద్వారా 42.80 కిలోమీటర్లు, ఎడమ కాలువ ద్వారా 12.80 కిలోమీటర్లు ఉంది. రెండు కాలువల ద్వారా బీఆర్ఎస్ హయాంలో వానకాలం, యాసంగిలో రెం డు పంటలకు 21,625 ఎకరాలకు సాగునీరు అందించారు. ఘనపూర్ ప్రాజెక్టులో 1.09 టీఎంసీ నీరు నిల్వ ఉంటుం ది. ఆనకట్ట ఎత్తు పెంచితే నీటినిల్వ సామ ర్థ్యం పెరిగి రైతులకు మేలు జరుగుతుంది. చివరి ఆ యకట్టుకు నీరందుతుం ది. రేవంత్ సర్కారు సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయకపోవడంతో యా సంగిలో సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయి.
సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల పేరు చెప్పి రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు విడుదల చేయలేదు. ఈసారి నీళ్లు ఇస్తుందనే ఆశతో యాసంగిలో వరితో పాటు ఇతర పంటలు సాగుచేశాను. ప్రభుత్వం ఘనపూర్ ఆయకట్టకు సాగునీరు విడుదల చేయకపోవడంతో పంటలకు సాగునీరు అందడం లేదు. కాలువలో ఉన్న నీటిని కరెంట్ మోటర్తో పంటలకు నీరు అందించి కాపాడే ప్రయత్నం చేశాం. కాలువల్లో నీరు ఎండిపోవడంతో పొట్ట దశలో ఉన్న వరి పంట ఎండిపోతున్నది. పంటలు కాపాడేందుకు ప్రభుత్వం నీళ్లివ్వాలి.
– సత్యనారాయణ, రైతు, కిష్టాపూర్ (మెదక్ జిల్లా)
వరిపంట పొట్ట దశలో ఉంది. వరి పంటకు సాగునీరు అందించేందుకు ఘనపూర్ ఆయకట్టలో నీరు లేదు. సాగునీటి కాలువల్లో నీరులేక ఎండిపోయి కనిపిస్తున్నాయి. నాకున్న రెండెకరాల పొలంలో వరి పంట సాగు చేస్తున్నా. ప్రభుత్వం వెంటనే సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలి. ప్రాజెక్టు ఎత్తు పెంచి చివరి ఆయకట్టు వరకు నీళ్లందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– పెద్ద రమేశ్, రైతు, కిష్టాపూర్ (మెదక్ జిల్లా)