జిన్నారం, డిసెంబర్ 22: సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీఆర్ఎస్ హయాంలో శివాజీ మినీస్టేడియం ఏర్పాటు చేశారు. సుమారు రూ. కోటి నిధులు ఖర్చుచేసి మినీ స్టేడియం చదును పనులు చేపట్టారు. అప్పటి నుంచి నేటి వరకు స్టేడియం వినియోగంలోకి తీసుకురాలేదు. మినీ స్టేడియం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సుమారు రూ.70లక్షల సీఎస్ఆర్ నిధులతో రెండేండ్ల క్రితం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు.
రెండేండ్ల నుంచి మినీస్టేడియంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తుంది. స్టేడియం సిద్ధంగా ఉన్నా తగిన సౌకర్యాలు లేక నిరుపయోగంగా మారింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మినీస్టేడియాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని జిన్నారం మున్సిపల్ పరిధిలోని ఆయా గ్రామాల యువకులు, క్రీడాకారులు కోరుతున్నారు.
మినీస్టేడియం వినియోగంలో రాలేదు. దీంతో క్రీడాకారులు నష్టపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో క్రీడలకు ప్రోత్సాహం లభించింది. ప్రభుత్వం స్పందించి నిరుపయోగంగా ఉన్న మినీస్టేడియాన్ని వినియోగంలోకి తీసుకురావాలి.
– శ్రీకాంత్ గౌడ్, యువజననేత, జిన్నారం, సంగారెడ్డి జిల్లా