పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన పడకేసింది. ఒకో అధికారికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలు అప్పగించడం, వారు చుట్టపు చూపుగా గ్రామాలకు వచ్చిపోతుండడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలు, చేతిపంపులు మరమ్మతులకు నోచుకోకపోవడం, పారిశుధ్యంపై పర్యవేక్షణ కొరవడడం, వీధిదీపాలు వెలగక పోవడం, మొక్కల పెంపకం, నర్సరీలు, వైకుంఠధామాల నిర్వహణ అటకెక్కాయి. దీంతో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మెదక్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉండగా, 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 455 పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. జిల్లాలో 290 మంది ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. గ్రామాల్లో పనులను ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నాటికి సర్పంచుల పదవీ కాలం ముగిసి రెండేండ్లు పూర్తవుతుంది. ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమై ఇన్ని నెలలు అవుతున్నా పల్లెల్లో సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.
పంచాయతీల పాలనా వ్యవహారాలను చూసేందుకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. నిధులు లేమికి తోడు తమకున్న శాఖాపరపరమైన విధులే కాకుండా అదనపు బాధ్యతలతో ప్రత్యేకాధికారులు పల్లెలను పెద్దగా పట్టించుకోవడం లేదు. నామమాత్రంగా కూడా పల్లెల ముఖం చూడడం లేదు. దీంతో పంచాయతీల్లో పర్యవేక్షణ కొరవడింది. పంచాయతీ కార్యదర్శులపైనే మొత్తం భారం పడింది. అభివృద్ధి పనులు పడకేశాయి. మరమ్మతులు అటకెకాయి. పంచాయతీల ఖాతాల్లో పైసా నిధులు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిధులు రాక జీపీలు అల్లాడుతున్నాయి. పాలన మొకుబడిగా సాగుతోంది. పారిశుధ్య పనులు పూర్తిస్థాయిలో జరగడం లేదు. గతంలో చేపట్టిన పలు పనులకు సంబంధించి నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో కొత్త పనులు చేపట్టే పరిస్థితి లేక దోమలు, ఈగలు, దుర్గంధంతో గ్రామాలు కంపుకొడుతున్నాయి.
2024 ఫిబ్రవరి 2 నుంచి జీపీలకు ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. మండల, డివిజన్ స్థాయిలోని గెజిటెడ్ ఉద్యోగులకు మూడు కంటే ఎకువ పంచాయతీ బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. వారికి అప్పటికే పనిభారం అధికంగా ఉండడంతో పంచాయతీల బాధ్యతలు అప్పగించడంతో విధులకు న్యాయం చేయలేకపోతున్నారు. మిషన్ భగీరథ, నీటిపారుదల శాఖల అధికారులు తమ సొంతశాఖ విధులకే పరిమితమవుతున్నారు. సొంత శాఖ విధులతో పాటు ఉన్నతాధికారుల సమీక్షలు, సమావేశాలకు హాజరుకావడం వంటి బాధ్యతలు వారిపై ఉన్నాయి. ప్రత్యేకాధికారులు వారంలో కనీసం రెండు పర్యాయాలైన గ్రామాలకు వెళ్లడం లేదు. ఫలితంగా స్థానిక పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఎంపీడీవోలపై అదనపు భారం పడుతున్నది. పంచాయతీలను ప్రత్యేకాధికారులు పట్టించుకోక పోవడంతో అనేక గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మిషన్ భగీరథ పైప్లైన్లు చాలాచోట్ల లీకై నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. పాడైన బోర్లను బాగు చేయించేవారు కరవయ్యారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. హరితహారం మొకలు ఎండిపోతున్నాయి. నర్సరీల నిర్వహణ సరిగా జరగడం లేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు దాదాపు 14 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు రెండు నెలలకోసారి మంజూరవుతున్నా , సరిపోక పంచాయతీలకు ఇకట్లు తప్పడం లేదు. పంచాయతీలకు పాలకవర్గం ఉన్న సమయంలో అప్పోసప్పో చేసి గ్రామాల అభివృద్ధికి సర్పంచులు పూనుకునే వారు. బిల్లులు మంజూరైనప్పుడు తీసుకునేవారు. ఇప్పుడు పంచాయతీల్లో నిధుల లేమితో ప్రత్యేకాధికారులు ఎలాంటి పనులు చేయడం లేదు. దీనికి తోడు ప్రత్యేకాధికారుల పాలనలో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. గ్రామాలకు మంజూరైన పనుల్లో అధికార పార్టీ నాయకుల జోక్యం పెరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయా పనులకు సంబంధించి ఒత్తిళ్లు పెరగడంతో ప్రత్యేకాధికారులు మిన్నకుండి పోతున్నారు.
గ్రామ పంచాయతీలు తీవ్రమైన నిధుల కటకటను ఎదురొంటున్నాయి. ఖాతాల్లో డబ్బులు లేక, అత్యవసర పనులకు ఖర్చు చేయలేక సతమతమవుతున్నాయి. పారిశుధ్య కార్మికుల జీతాలు, పైప్లైన్ల లీకేజీలకు మరమ్మతులు, బోర్ల మరమ్మతులు, పంచాయతీ ట్రాక్టర్ నెలవారీ బ్యాంకు వాయిదా, గ్రామాల్లో విద్యుత్ దీపాలు, నెలనెలా విద్యుత్ బకాయిలు.. ఇవన్నీ కచ్చితంగా చెల్లించాల్సిందే. నిధుల లేకపోవడంతో ఈ బరువు బాధ్యతల గురించి ప్రత్యేకాధికారులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామ కార్యదర్శులే ఎలాగోలా కార్మికులకు జీతాలు సర్దుబాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒకో గ్రామపంచాయతీ రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు అప్పు చేసి చెల్లిస్తున్నారు.
పంచాయతీల ప్రత్యేకాధికారులు ఖర్చు విషయంలో చేతులెత్తేస్తుండడంతో భారమంతా కార్యదర్శులపైనే పడుతోంది. పంచాయతీలకు ఆస్తిపన్ను, ఎస్ఎఫ్సీ ఖాతా, 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు వస్తాయి. ఆస్తి పన్నుకు మించి ఖర్చులు ఉండడంతో ఈ ఖాతా ఎప్పుడూ ఖాళీగానే ఉంటోంది. ఆస్తిపన్ను, ఎస్ఎఫ్సీ ఖాతాల్లో జమయ్యే మొత్తం ట్రెజరీ ద్వారా డ్రాచేయాల్సి ఉంటుంది. ఇక 15వ ఆర్థిక సంఘం నిధులు,ఎస్ఎఫ్సీ నిధులు రెండేండ్లుగా పెండింగ్లో ఉన్నాయి. పంచాయతీలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించక పోవడంతో రెండేండ్లకు సంబంధించి మెదక్ జిల్లాకు రూ.25 కోట్ల ఫండ్స్ రాలేదు. దీంతో పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి.