కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రైతుబజార్ భవనం ఎందుకూ పనికి రాకుండా పోతున్నది. అధికారుల అలసత్వం, స్థానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో భవనాన్ని లక్షణంగా వదిలేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శివాజీనగర్‌లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూ.3కోట్ల నిధులతో నిర్మించిన రైతుబజార్ కమ్ ఫంక్షన్‌హాల్ భవనం వృథాగా మారింది. జనవరి 5, 2025న రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ ఈ భవనాన్ని ప్రారంభించారు. వెంటనే వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కానీ, మంత్రుల ఆదేశాలను మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు బేఖాతర్ చేస్తున్నారు.
హుస్నాబాద్, అక్టోబర్ 26: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు, వ్యాపారుల సౌకర్యార్ధం రైతుబజార్ నిర్మించారు. దీనిని అందుబాటులోకి తెచ్చి ఇక్కడే అన్నిరకాల కూరగాయల విక్రయాలు జరపాల్సి ఉండగా, అలా జరగడం లేదు. రైతబజార్ను వినియోగంలోకి తేకుండా వృథాగా వదిలేస్తున్నారని, హుస్నాబాద్ పట్టణ నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఉండే ఈ ప్రాంతంలో విక్రయాలు ప్రారంభించాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేయడంతో పాటు మీడియాలోనూ కథనాలు వచ్చాయి.
ఇందుకు స్పందించిన స్థానిక ప్రజా ప్రతినిధులు ఈనెల 13న రోడ్లపై ఉన్న కూరగాయల దుకాణాలు అన్నింటినీ ఇక్కడికి తరలించి విక్రయాలను ప్రారంభించారు. ఇక్కడే విక్రయాలు జరపాలని రైతులు, వ్యాపారులకు సూచించారు. కానీ, మూడు రోజుల అనంతరం ఇక్కడ దుకాణాలు కనిపించకపోవడం విశేషం. తిరిగి దుకాణాలన్నీ మళ్లీ రోడ్లపైకి వచ్చాయి. దీంతో రైతుబజార్లో కూరగాయల విక్రయాలు మూడు రోజుల ముచ్చటగా మారింది. మూడు రోజుల పాటు కూరగాయల దుకాణాలతో కళకళలాడిన రైతు బజార్ ఇప్పుడు నిర్మానుష్యంగా, బోసిపోయి కనిపిస్తున్నది.
రైతు బజార్లోనే కూరగాయల క్రయవిక్రయాలు జరపాలని అటు రైతులు, వ్యాపారులకు, ఇటు ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. తూతూమంత్రంగా అక్కడక్కడ ఫ్లెక్సీలు కట్టి వదిలేశారు తప్ప రైతుబజార్లోనే కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసినట్లు విస్తృత ప్రచారం చేయలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మూడు రోజులు వేచి చూసిన వ్యాపారులు తమ దుకాణాలను మళ్లీ రోడ్లపైకి తెచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రోడ్లపై కూరగాయల దుకాణాలు పెట్టడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నా యి.ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్నది. కూరగాయల కొనుగోలు దారులు కూడా రోడ్లపైకి వచ్చి కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజార్లోనే విక్రయాలు జరిగేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇందు కు రైతులు, వ్యాపారులకు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా చేస్తేనే రైతుబజార్ వినియోగంలోకి వస్తుందని స్థానికులు భావిస్తున్నారు. రైతు బజార్ వద్ద తప్పా కూరగాయలు ఎక్కడా దొరకవు అనేది విస్తృత ప్రచారం చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.