కల్హేర్, నవంబర్ 9: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో పలు రోడ్లు అధ్వానంగా మారడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన రోడ్లు తప్పా ఈ రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. 161 నంబర్ జాతీయ రహదారి మహాదేవుపల్లి చౌరస్తా నుంచి కల్హేర్ మీదుగా సిర్గాపూర్ మండల కేంద్రం వరకు రోడ్డు నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో నిధులు మంజూరయ్యాయి. కానీ, ఏ కారణం చేతనో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఎన్నికలప్పుడు ఈ రోడ్డు సమస్యను కాంగ్రెస్ బ్రహ్మాస్త్రంలా వాడుకుని ఎన్నికల్లో గెలిచింది. కానీ, గెలిచిన తర్వాత రోడ్ల మరమ్మతులను రేవంత్‌రెడ్డి సర్కారు విస్మరించింది.
కల్హేర్ మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా ఉండడంతో ఆర్టీసీ బస్సు రావడం లేదు. వివిధ ప్రాంతాల నుంచి కల్హేర్ మండల కేంద్రానికి రావాలంటే ఇబ్బందిగా మారింది. కల్హేర్‌కు బదిలీపై రావాలంటేనే ఉద్యోగులు హడలిపోయి ఇతర ప్రాంతాలకు బదిలీలు చేయించుకుంటున్నారు. కల్హేర్ మండల కేంద్రం నుంచి మహాదేవ్పల్లి చౌరస్తా, కల్హేర్ నుంచి కామారెడ్డి జిల్లా పిట్లం వరకు రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలకు వాహనదారులు, ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. నారాయణఖేడ్‌లో ఆర్టీసీ బస్సు డిపో ఉన్నప్పటికీ కల్హేర్ మండల కేంద్రం మీదుగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్, పిట్లం మండల కేంద్రాలకు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేదు.
కల్హేర్‌లోని వంద పడకల దవాఖానకు వెళ్లాలన్నా రోడ్డు బాగాలేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్హేర్ నుంచి మహాదేవుపల్లి చౌరస్తా, కల్హేర్ నుంచి పిట్లం సరిహద్దు వరకు రోడ్లు అడుగడుగునా గుంతలు పడి నానా తిప్పలు పడుతున్నారు. మండలంలో కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు వివిధ ప్రాంతాలను నుంచి మహాదేవుపల్లి చౌరస్తాకు సులభంగా చేరుకుంటున్నారు. కానీ, అక్కడి నుంచి కల్హేర్‌కు చేరుకోవాలంటే ఆటోల కోసం గంటల తరబడి వేచి చూసి సమయానికి ఆఫీస్‌కు వెళ్లలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్హేర్ మండల కేంద్రానికి నారాయణఖేడ్ నుంచి గతంలో నిజాంసాగర్‌కు బస్సులు నడిపేవారు. రోడ్డు అధ్వానంగా మారడంతో బస్సులు నడపడం లేదు.