సిద్దిపేట, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ హయాంలో జనగామ నియోజకవర్గంలో మండుటెండల్లో మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్‌డ్యామ్‌లు.. నేడు కాంగ్రెస్ పాలనలో నీళ్లులేక కళ తప్పాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహహరిస్తున్నదని, మరో రెండు వారాలు పంటలను కాపాడితే చేతికి వచ్చేవని, ఈ పరిస్థితులు ప్రస్తుతం లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట, కొమురవెల్లి ప్రాంతాలకు సాగునీటిని అందించి సస్యశ్యామలం చేసింది.పుష్కలంగా పంటలు పండా యి.
కేసీఆర్ సూచనలతో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సాగునీటిని అందించడానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రంగనాయకసాగర్ నుంచి ధూళిమిట్ట ప్రాంతానికి నీళ్లు తెచ్చి చెరువులు, చెక్‌డ్యామ్‌లు నింపా రు. ఫలితంగా ధూళిమిట్ట, జాలపల్లి, దాని పరీవాహక ప్రాంతాలకు సాగునీరు అందింది. వాగులో ఉన్న చెక్‌డ్యామ్‌లను నింపడంతో ధూళిమిట్ట నుంచి జాలపల్లి మీదుగా ఘనపూర్, బస్వాపూర్ వరకు కాళేశ్వరం జలాలు అంది మండుటెండల్లో జలకళను సంతరించుకున్నాయి. లద్నూరు రిజర్వాయర్‌కు ప్రత్యేకంగా పాయింట్ పెట్టించి లద్నూరు రిజర్వాయర్‌ను వరుసగా మూడుసార్లు దేవాదుల నుంచి నీటిని నింపారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ ద్వారా ప్రతి చెరువు, చెక్‌డ్యామ్‌ను నింపడంతో రైతులు గుంట ఎండిపోకుండా పంటలు పండించుకున్నారు.
రైతుల ప్రయోజనాలే ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటిని విడుదల చేయకుండా తమ పంటలను ఎండగొట్టిందని, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేర్యాల ప్రాం తంలో దాదాపుగా 2600 ఎకరాలకు పైగా వరి పంటతో పాటు ఇతర ఆరుతడి పంటలు ఎండిపోయాయి. తక్షణమే ప్రభు త్వం స్పందించి పంట నష్టం అంచనా వేసి ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల చేర్యాల, ముద్దూరు, కొమురవెల్లి, ధూళిమిట్ట ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు సైతం చేపట్టారు.
బీఆర్ఎస్ హయాంలో నిండుకుండలా ఉన్న తపాస్‌పల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా ఎండిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలని ధర్మసాగర్ డీఈతో పాటు సంబంధిత అధికారులతో స్వయంగా వెళ్లి మాట్లాడాను. మోటర్ల నిర్వహణ బిల్లులు చెల్లించాలని 34 రోజలు పాటు వాళ్లు సమ్మె చేస్తే వారి వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్న. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రూ. 6 కోట్ల పెండింగ్ బిల్లులు ఇప్పించా.
తక్షణమే సాగునీటిని ఇచ్చి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని స్వయంగా కలిసి విన్నవించా. ధర్మసాగర్ వద్దకు వెళ్లి నీటిని విడుదల చేయాలని రైతులతో కలిసి ధర్నా చేశా. ఎట్లాగైన పంపులు నడిపి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. దేవాదుల ద్వారా నీటిని విడుదల చేసి తపాస్‌పల్లి రిజర్వాయర్ నింపాలని పలుసార్లు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరా. రంగనాయక సాగర్ ఈఎన్సీతో మాట్లాడి ధూళిమిట్ట, లింగాపూర్, కమలాయపల్లి, అర్జున్‌పట్ల, జాలపల్లి తదితర 11 గ్రామాలకు నీటిని విడుదల చేయాలని కోరడంతో నీటిని విడుదల చేశారు.
మల్లన్నసాగర్ నుంచి రూ. 350 కోట్లతో చేపట్టే పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కు లేఖ రాశా. మిగిలిన పనులు పూర్తి చేయాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరాను. నియోజకవర్గంలో కాల్వల కోసం భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశా. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా జనగామ నియోజకవర్గంలో రూ. 600 కోట్ల విలువైన పంట నష్టం జరిగింది. 50శాతం మేర పంటలు ఎండిపోయాయి. ప్రభుత్వం కండ్లు తెరిచి నీటిని విడుదల చేసి మిగతా పంటలను కాపాడాలి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
మూడు, నాలుగేండ్ల కింద గిట్లనే చెరువు, కుంటలు ఎండిపోతే అప్పట్ల కేసీఆర్, హరీశ్‌రావు సార్లు దేవాదుల, రంగనాయకసాగర్ కాల్వల ద్వారా మా చెరువులు, కుంటలు నింపిండ్రు. చెరువు, కుంటలల్లకు నీళ్లు రావడంతో బోరుబావులల్ల నీళ్లు పుల్గా ఉండేవి. అప్పుడు ఎక్కడా పంటలు ఎండిపోలేదు. కాంగ్రెస్ సర్కార్ అటువంటి పనులేవి చేయకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోయి బోరుబావులల్ల నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నయి. ఇప్పుడు నీళ్ల చానా ఇబ్బందిగా ఉంది.
– శీలం నర్సింహులు, రైతు, మర్మాముల (మద్దూరు మండలం)