తొగుట, జూలై 10: ప్రజా పాలనలో వైద్యరంగానికి పెద్దపీట వేస్తామన్న మంత్రి దామోదర చేతల్లో చూపడం లేదు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఓ కమ్యూనిటీ భవనంలో అద్దెకు నిర్వహిస్తున్నారు. దట్టంగా చెట్లు పెరగడంతో పాములు సంచరిస్తున్నాయి. దీంతో ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గర్భిణులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మౌలిక వసతులు లేకపోవడంతో నరకయాతన పడుతున్నారు. మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉండడంతో వందమీటర్ల దూరంలో ఉన్న ఇతరుల వాష్‌రూమ్‌కు నెలనెలా డబ్బులు చెల్లిస్తూ వినియోగించకుంటున్నట్లు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీస సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బందితో పాటు గర్భిణులు నిత్యం నరకం చూస్తున్నారు. ఆరోగ్య కేంద్రానికి అద్దె , మరుగుదొడ్డికి నెలనెలా సొంత డబ్బులు చెల్లిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఆరోగ్య కేంద్రంలోని ఫ్యాన్లు, ఫర్నిచర్,ఇతర వస్తువులను తమ డబ్బులతో ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు. 2023లో రూ. 20 లక్షలతో శాశ్వత భవన నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. నిధులు లేమి కారణంగా మధ్యలోనే పనులు నిలిచిపోయాయి.
సొంత డబ్బులు రూ.12 లక్షలతో పిల్లర్లువేసి స్లాబ్‌ను నిర్మించినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు డబ్బులు రాకపోవడంతో చేసేదేమి లేక చేతులెత్తేసినట్లు వెల్లడించారు. కొంతవరకు నిర్మించిన కొత్త భవనం గేదెలకు,పందులకు అడ్డాగా మారింది. అధికారులకు,ప్రజా ప్రతినిధులకు ఎన్నోసార్లు గోడువెళ్లబోసుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల డిప్యూటీ కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. సిబ్బంది సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా, పరిష్కరిస్తానని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అతీగతి లేదు. అధికారులు స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆరోగ్య ఉపకేంద్రానికి రూ. 20 లక్షలు నిధులు కేటాయించారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. అప్పు చేసి డబ్బులు తీసుకువచ్చి స్లాబ్, పిల్లర్ల వరకు భవనాన్ని నిర్మించా. డబ్బులు రాకపోవడంతో పనులు నిలిపివేశా. నెలనెలా మిత్తి కడుతూ ఇబ్బందులు పడుతున్నా. ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. నిధులు విడుదల చేస్తే పూర్తి భవనాన్ని నిర్మిస్తా.
– ఎండీ కలీమొద్దీన్, కాంట్రాక్టర్