హుస్నాబాద్, డిసెంబర్ 22: పల్లెల్లోనూ పట్టణ వాతావరణం కల్పించి ప్రకృతి ఆహ్లాదాన్ని పంచాలనే ఉద్దేశంతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పడావు పడుతున్నాయి. గొప్ప ఆశయంతో దాదాపు 70శాతం గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను నిర్మించింది. రంగురంగుల పూలమొక్కలు, వివిధ రకాల అందమైన మొక్కలు ఆహ్లాదాన్ని పంచి పచ్చదనంతో కళకళలాడిన ప్రకృతి వనాలు నేడు ఆదరణ లేక వెలవెలబోతున్నాయి.
కేవలం పట్టణాలకే పరిమితమైన పార్కులను పల్లెలకు తీసుకొచ్చి పల్లె ప్రజలను సైతం పట్టణాలకు తీసిపోకుండా ఆత్మైస్థెర్యంతో బతికేలా చేసిన బీఆర్ఎస్ సర్కారు పనితీరుపై అప్పట్లో ప్రశంసల జల్లులు కురిశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి రెండేండ్లుగా వీటిని పట్టించుకోకపోవడంతో పచ్చని చెట్లు, మొక్కలు, పచ్చికబయళ్లు కాస్తా ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఎండిన మొక్కలు, వాడిపోయిన చెట్లతో పల్లె ప్రకృతి వనాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పల్లె ప్రజలపై కోపమో లేక తెలంగాణ ప్రధాత కేసీఆర్ చేసిన అభివృద్ధిని కనుమరుగు చేయాలనే కుట్రనో ఏమో కాని పచ్చని ప్రకృతి వనాలను మాత్రం కనిపించుకుండా చేస్తుంది. ప్రభుత్వం, అధికారుల తీరుపై పల్లె ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పల్లె ప్రకృతి వనాలు ఎకరం నుంచి మొదలుకొని ఐదెకరాల్లో నిర్మించారు. ఇందులో తీరొక్క పూల మొక్కలు, డిజైన్ మొక్కలు, గార్డెన్లో అందాన్ని ఇచ్చే మొక్కలు, వివిధ రకాల పండ్ల మొక్కలు నాటారు. వాకింగ్ ట్రాక్లను సైతం నిర్మించి నిత్యం వాకింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. చిన్నారుల కోసం ఆట వస్తువులు సైతం అందుబాటులో ఉంచారు. పల్లె ప్రజలు సాయంత్రం పనులు తీరాక ఆహ్లాదంగా పిల్లలతో పాటు సేద తీరే విధంగా పల్లె ప్రకృతి వనాలను తీర్చిదిద్దారు. వీటిని ఈజీఎస్ సిబ్బందితో నిత్యం నీళ్లు పట్టించడం, గార్డెనింగ్ చేయించడం చేశారు. రెండేండ్ల క్రితం వరకు ప్రకృతి వనాలు అందాలు పంచుతూ పర్యావరణాన్ని కాపాడుతూ, పల్లె ప్రజలకు సైతం పట్టణ వాతావరణాన్ని కల్పిస్తూ విరాజిల్లాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీటికి గ్రహణం పట్టినైట్లెంది.
పల్లెల్లో రెండేండ్లుగా అధికారులు పల్లె ప్రకృతి వనాలపై శ్రద్ధ కనబర్చడం లేదు. ప్రకృతి వనాలను పరిరక్షించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం ఉన్నా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా రక్షించేందుకు చర్యలు తీసుకునేది. కానీ గతంలో జరిగిన అభివృద్ధిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని కాంగ్రెస్ సర్కారు కుట్రపూరితంగానే పచ్చని పల్లె ప్రకృతి వనాలను పొట్టన పెట్టుకుంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి పల్లెల్లోని ప్రకృతి వనాలను రక్షించి గ్రామీణులకు ఆహ్లా దం పంచేలా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మా ఊరిలో బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో గ్రామస్తుల మద్దతులో సుమారు మూడెకరాల్లో పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించాం. ఇందులో రకరకాల మొక్కలు, పండ్లమొక్కలు పెట్టాం. మా పదవి ముగిసేంత వరకు కూడా నిత్యం వీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాం. ప్రకృతి వనంలో మొక్కలన్నీ ఏపుగా పెరిగాయి. మా గ్రామం నుంచే కాకుండా ఇతర గ్రామాల నుంచి, హుస్నాబాద్ పట్టణం నుంచి కూడా విద్యార్థులు, యువత ప్రకృతి వనం చూసేందుకు, ఇక్కడ కాసేపు సేదతీరేందుకు, ఆహ్లాదాన్ని పొందేందుకు వచ్చేవారు. కానీ రెండేండ్ల నుంచి దీనిని పట్టించుకునే వారు కరువయ్యారు. అందమైన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం శ్రద్ధపెట్టి పల్లె ప్రకృతి వనాలను కాపాడాలి.
-తోడేటి రమేశ్, మాజీ సర్పంచ్, పందిల్ల, సిద్దిపేట జిల్లా
పల్లె ప్రకృతి వనం గ్రామస్తులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చేది. ఇందులో పూలమొక్కలతో పాటు పండ్ల మొక్కలు కూడా నాటాం. మా హయాంలో పార్కు నిర్వహణ ఎంతో బాగా చేశాం. కొందరు ఇందులో ఉదయం, సా యంత్రం వాకింగ్ చేసేవారు. యువత ఇందులో ఆటపాటలతో గడిపే వారు. కానీ ఇటీవల ఈ పార్కును పట్టించుకునేవారు లేరు. నీళ్లు పోసేవారు లేక మొక్కలు ఎండిపోయి పార్కు మొత్తం వెలవెలపోతోంది. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్వహణ చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
– ఇర్రి లావణ్యారాజిరెడ్డి, మాజీ సర్పంచ్, అంతకపేట, సిద్దిపేట జిల్లా