నారాయణఖేడ్, నవంబర్ 23: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో పలు గ్రామాల రోడ్ల దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నది. పట్టించుకోని ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వెరసి ఆయా రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదంటే ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం ఇట్టే అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు రోడ్లకు నిధులు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయినప్పటికీ పనులు ప్రారంభించకపోగా, మరికొన్ని రోడ్ల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిధులు మంజూరు కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం టెండర్లు సైతం పూర్తి చేయడం లేదు.
కొన్ని రోడ్డు పనులు బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభించగా, అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదేం విచిత్రమో గాని ప్రారంభమైన పనులు సైతం నిలిచిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాలకు రాకపోకలు సాగించడం కష్టతరంగా మారింది. గుంతలు పడిన రోడ్ల కారణంగా తరుచూ వాహనదారులు ప్రమాదాలకు గురై గాయపడిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్ల దుస్థితి కారణంగా పలు గ్రామాలు, తండాలకు అంబులెన్స్‌లు రావడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేండ్లు కావస్తున్నా పాలకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతున్నది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నుంచి సిర్గాపూర్ వరకు డబుల్ లేన్ రోడ్డు ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.15.75 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. అటు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో అడపాదడపా పనులు చేపట్టగా, ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి.
మండలంలోని తుర్కపల్లి నుంచి సిర్గాపూర్ మండలం కడ్పల్ వరకు లింక్ రోడ్డు ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసి, టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పనులు ప్రారంభం కాలేదు. ర్యాకల్ నుంచి పలుగు తండా వరకు బీటీ రోడ్డు ఏర్పాటుకు రూ.1.14 కోట్ల నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసి టెండర్ సైతం పూర్తి చేసింది. ఆ రోడ్డు పనులు సైతం ఇప్పటి వరకు ప్రారంభించక పోవడం గమనార్హం. జూకల్ నుంచి బండ్రాన్‌పల్లి వరకు బీటీ రోడ్డు ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.49 కోట్లు, అంత్వార్ నుంచి సత్యగామ వరకు రోడ్డు అభివృద్ధికి రూ.33 లక్షలు మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పూర్తి చేయకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
నారాయణఖేడ్ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోడ్లను బాగు చేయించాల్సిన ఎంపీ, ఎమ్మెల్యే ఏమాత్రం దృష్టి సారించడం లేదు. గుంతలు పడిన రోడ్లపై వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారనే అనుమానం కలుగుతున్నది.
– రవీందర్‌నాయక్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ మాజీ సభ్యుడు