సిద్దిపేట, మే 31: బీఆర్ఎస్ పాలనలో పల్లెలు ప్రగతి పథంలో పరుగులు తీశాయని, కాంగ్రెస్ సర్కారు వచ్చాక పల్లెల్లో ప్రగతి కుంటుపడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లోని గ్రామాల అభివృద్ధిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో అనేక గ్రామా లు అవార్డులు సాధించాయని, నేడు అవార్డుల్లో గ్రామాలు వెనుకంజలో ఉండడం బాధాకరం అన్నారు.
గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎష్ ప్రభుత్వం ప్రతినెలా రూ. 275 కోట్లు, ఏటా రూ.3330 కోట్ల నిధులు ఇచ్చినట్లు గుర్తుచేశారు. నేడు పల్లెల్లో పారిశుధ్యం లోపించి చెత్త కుప్పలుగా దర్శనమిస్తున్నాయని, మరోవైపు పంచాయతీలు అప్పుల ఊబిలో కూరుకుపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీల పాలన గాడి తప్పిందని, అధికారులు దృష్టి పెట్టి అభివృద్ధి పనులు కొనసాగించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.
సిద్దిపేట నియోజకవర్గం అంటేనే ఆదర్శ గ్రామాలకు, అవార్డులకు పెట్టింది పేరు అని హరీశ్‌రావు అన్నారు. నియోజకవర్గంలో 45 అవార్డులు తెచ్చుకున్నామని తెలిపారు, మళ్లీ ఆ దిశగా గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించి ఆదర్శంగా నిలపాలని, పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ ప్రతిరోజు చేపట్టాలని, గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. నర్సరీలు, మొకలు నాటేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. నీటి కొరత ఉండకుండా చూడాలని, నిధుల కొరత ఉంటే తన దృష్టికి తేవాలని అధికారులకు హరీశ్‌రావు సూచించారు.