సిద్దిపేట, ఆగస్టు 21: వసతి గృహ విద్యార్థులను కన్న పిల్లలుగా చూసుకోవాలని, హాస్టళ్లలో సమస్యల పరిషారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనవంతుగా కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సాయంత్రం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో వసతి గృహాల సలహా సంఘం సమావేశంలో పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గ స్థాయి ఎస్సీ, ఎస్టీ, బీసీ పాఠశాలల అనుబంధ హాస్టల్స్, కళాశాలల అనుబంధ హాస్టల్స్ పని తీరు పై హాస్టల్స్ వారీగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
గత ప్రభుత్వంలో సంక్షేమ హాస్టల్స్ అంటే నమ్మకం ఉండే, కానీ.. ఈ ప్రభుత్వంలో సంక్షోభ హాస్టల్స్‌గా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం గ్రీన్‌ఛానల్ ఏమైందని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి మాటలు ఉట్టివేనా అని ఎద్దేవా చేశారు. చెప్పుడు ఘనం… చేసుడు శూన్యమని ఎద్దేవా చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి దుస్తులు లేక హాస్టల్ విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, విద్యార్థులకు 6 నెలల నుంచి మెస్‌ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు రావడం లేదన్నారు. సీఎం రేవంత్‌కు హాస్టల్ విద్యార్థుల అవస్థలు కనపడం లేదా అన్నారు.
స్టూడెంట్ మేనేజెమెంట్ హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే రూ. 500 ప్యాకెట్ మనీ రెండేండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని, హాస్టల్స్‌లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల 8 నెలల జీతాలు పెండింగ్ ఉంచడం దారుణం అన్నారు. వెంటనే విద్యార్థులకు మెస్ ఛార్జ్‌లు, కాస్మోటిక్ ఛార్జ్‌లు చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి నేటికి విద్యార్థులకు ఇచ్చే బ్లాంకెట్స్, మంకీ క్యాప్స్, స్వెటర్స్, రెండు జతల షూస్, సాక్స్‌లు నేటికి ఇవ్వక పోవడం హాస్టల్ పిల్లల పై ప్రభుత్వం చిన్న చూపునకు నిదర్శనమన్నారు. వెంటనే షూస్, బ్లాంకెట్స్ అందించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉంటున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలని, అందుకు అనుగుణంగా ప్రతి హాస్టల్లో నాణ్యమైన ఆహారం అందించాలని హరీశ్‌రావు సూచించారు. రోజువారీగా మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాన్నారు. మరుగుదొడ్లు, స్నానాల గదులు ప్రతిరోజూ శుభ్రంగా ఉంచాలన్నారు. శుభ్రత పాటించకపోవడంతో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలు నిత్యం జరుగుతున్నందున, అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలన్నారు.
హాస్టల్స్‌కు చెడ్డ పేరు తేవద్దని, తాను హాస్టల్స్‌ని సందర్శించి, విద్యార్థులతో కలసి భోజనం చేస్తానని హరీశ్‌రావు అన్నారు.హాస్టల్స్‌లో సమస్యలు, మౌలిక సదుపాయాలపై ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలన్నారు. నియోజకవర్గంలో అన్ని హాస్టల్స్‌పై విద్యాధికారులు, తహసీల్దార్లు ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. అద్దె భవనాలు ఉండే హాస్టల్స్‌లో అద్దె కట్టక నెలలు గడుస్తున్నాయని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, కొన్ని హాస్టల్స్‌లో మరమ్మతులకు కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఎంఈవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, సంక్షేమ శాఖ అధికారులు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.