రామాయంపేట, ఏప్రిల్ 1 : కంకర రోడ్డుపై నడిస్తే కాళ్లు బొబ్బలెక్కుతున్నా మాపై దయ చూపరా.. అంటూ గిరిజన వాసులు అధికారులను, నాయకులను వేడుకుంటున్నారు. రామాయంపేట పురపాలిక పరిధిలోని కోమటిపల్లి గిరిజన తండాకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. రెండేండ్ల కింద గిరిజన తండాకు రూ. కోటిన్నరతో బీటీ రోడ్డుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టింది. కోమటిపల్లి గ్రామం నుంచి గిరిజన తండా వరకు కంకర పనులు చేపట్టింది. తీరా ప్రభుత్వం మారడంతో శిలాఫలకం శంకుస్థాపనకే పరిమితమైంది. తండా వరకు కంకర పర్చిన కాంట్రాక్టర్ తనకు బిల్లులు రావడం లేదంటూ పత్తా లేకుండా పోయాడు.
అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది. రెండేండ్ల కాలం నుంచి కంకర రోడ్డుతో గిరిజన వాసులు నడవలేక తీవ్రఇబ్బందులకు గురవుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కంకర రోడ్డు అలా ఉంటే ఇక తండాకు ప్రభుత్వం కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. తండా వాసులకు కనీసం తాగుదామన్నా మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదు. మున్సిపల్‌కు వెళ్లి ఏ అధికారికి చెప్పినా ఫలితం లేకుండా పోతున్నది. అధికారులు పేరుకే తండాకు వస్తారు.. ఇగచేస్తం.. అగ చేస్తం.. అంటూ కాలయాపన చేస్తున్నారు. నీళ్ల కోసం దూర ప్రాంతానికి వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండాకు రోడ్డు తోపాటు కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
కంకర పర్చిన కాంట్రాక్టర్ నిధులు రావడం లేదంటూ పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లి పోయిండు. రోడ్డుపై నుంచి నడవాలంటేనే కాళ్లు బొబ్బలెక్కు తున్నాయి. మాకు ఎన్నికలప్పుడు హామీలు కురిపించే నాయకులు ఇప్పుడు పనులు చేయడంలో మాత్రం తండాకు రావడం లేదు.
-చత్రియా నాయక్, తండావాసి
అధికారులు మాకు కనీసం తాగునీరు సరఫరా చేయడం లేదు. రెం డేండ్లుగా తాగునీరు సరిగ్గా రాక తీవ్రఇబ్బందులు పడుతున్నాం. రోడ్డు సమస్య వేధిస్తున్నది.
-బన్సీలాల్ నాయక్ ,తండావాసి
రామాయంపేట దవాఖానకు వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నా యి. కంకర రోడ్డు వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ కంకర తేలిన రోడ్డుతో అరగంటలో వెళ్లాల్సిన సమయంలో రెండు గంటలు పడుతుంది.
-పెంట్యా నాయక్, గిరిజన తండా