మిరుదొడ్డి, మే 20: ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల- చెప్యాల క్రాస్ రోడ్డులో బుధవారం రైతులు రహదారికి అడ్డంగా ముళ్లకంప వేసి ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటన్నర పాటు ఆందోళన చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రాక్టర్ల పై ధాన్యాన్ని తీసుకువెళ్తే రైస్ మిల్లర్లు అధికంగా కొతపెడుతున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రానికి లారీలు సమయానికి రాక రోజుల తరబడి అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలు చేసిన సందర్భాలు లేవన్నారు.. సంఘటనా స్థలానికి మిరుదొడ్డి తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై అందె సతీశ్ చేరుకున్నారు. లారీలు వచ్చే విధంగా తగు చర్యలు చేపడుతామని నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో అల్వాలతో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.