సిద్దిపేట అర్బన్, మే 30: కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూస్తూ నీరుగారుస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. శనివారం సిద్దిపేట రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 డీఈవో పోస్టులు ఖాళీగా పెట్టిందన్నారు.
రాజకీయ కక్షతో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కారు అర్ధాంతరంగా నిలిపివేయడం సరికాదన్నారు. పాఠశాలల్లో స్కావెంజర్ల బిల్లులు గత ఏడాదివి నాలుగు నెలలు,ఈ ఏడాదివి నాలుగు నెలలు పెండింగ్‌లో ఉండటంతో ఆ భారం హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై పడుతోందన్నారు. ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు,డీఏ ల సమస్యలతో పాటు, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి నెలకొందని హరీశ్‌రావు అన్నారు.
సాధారణంగా సొంత జిల్లాలో డీఈవోగా పనిచేసే అవకాశం రాదని, శ్రీనివాస్‌రెడ్డి సిద్దిపేట బిడ్డ కావడంతో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా ఇక్కడ అవకాశం కల్పించామని హరీశ్‌రావు గుర్తుచేశారు. నాలుగేండ్ల పాటు డీఈవోగా సొంత జిల్లాకు సేవలందించి,ఎవరి మనసు నొప్పించకుండా ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఆయన అందరి మన్ననలు పొందారని కొనియాడారు.
వరుసగా ఆరేండ్లు పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడంలో డీఈవోగా శ్రీనివాస్‌రెడ్డి చేసిన కృషి ఎంతో ఉందన్నారు. మనఊరు-మనబడి పనులను వేగవంతంగా పూర్తి చేయించి, అత్యధిక పాఠశాలలు బాగుపడటంలో ఆయన పాత్ర కీలకం, అదనంగా జిల్లా క్రీడాధికారిగా బాధ్యతలు చేపట్టి మంచిపేరు తెచ్చుకున్నారని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేయడంతో చాలా మందికి డీఈవోలుగా అవకాశం దక్కిందన్నారు. ఖానాపూర్ లో పుట్టి పెరిగిన శ్రీనివాస్‌రెడ్డికి ఇది పదవికి మాత్రమే విరమణ, ఆయన సేవలకు విరమణ లేదన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఆయన తన సేవలు అందించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని హరీశ్‌రావు అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.