హుస్నాబాద్, నవంబర్ 9: మెట్ట ప్రాంతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలను తెచ్చి బీడు వారుతున్న నేలలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన గౌరవెల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో వివక్షకు గురవుతోంది. కేసీఆర్ కలల ప్రాజెక్టు గౌరవెల్లి రిజర్వాయర్ పనుల్లో పురోగతి కరువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తట్టెడు మట్టి తీయలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం భూనిర్వాసితుల సమస్యలపై గొంతెత్తి నానాయాగిన చేసింది కాంగ్రెస్. తాము అధికారంలోకి వస్తే రిజర్వాయర్ రెండేండ్లలో పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు, తీరా అధికారంలోకి వచ్చాక ఇటువైపు చూడడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా భూనిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు పనులపై సమీక్ష, కాల్వల నిర్మాణం ప్రారంభించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కనీసం స్పందించడం లేదు.
2007లో సమైక్య రాష్ట్రంలో గౌరవెల్లి రిజర్వాయర్‌ను కేవలం 1.23టీఎంసీల సామర్థ్యంతోనే శంకుస్థాపన చేశారు. కొద్దిమేర కట్ట పనులు మాత్రం పూర్తి చేసి అనంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. 2014లోబీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 8.23టీఎంసీలకు పెంచింది. అప్పటి సీఎం కేసీఆర్ రిజర్వాయర్‌ను సందర్శించి త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.

మొత్తం రూ. 1095.99 కోట్ల నిధులతో రిజర్వాయర్ కట్ట నిర్మాణం, రూ.770 కోట్లతో 12కి.మీటర్ల మేర టన్నెల్, సర్జిపూల్ పంపుహౌస్ నిర్మాణం, 32 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు భారీ మోటార్లను సైతం బిగించారు. 3,836ఎకరాల భూసేకరణ చేసి 937 నిర్వాసితుల కుటుంబాలకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేశారు. 2023 అక్టోబర్ నాటికి బీఆర్ఎస్ హయాంలో రిజర్వాయర్ పనులు 96శాతం పూర్తయ్యాయి. మూడు మోటార్లను ఆన్ చేసి రిజర్వాయర్‌లో గోదావరి నీళ్లను సైతం నింపారు. ఇక మిగిలింది 182మంది నిర్వాసిత కుటుంబాలకు చెల్లింపులు, 35 ఇండ్లకు పరిహారం, కుడి కాల్వ మిగులు పనులు, ఎడమ కాల్వ భూసేకరణ పనులు పూర్తి చేయాల్సి ఉండేది. కొన్ని పార్టీలు కుట్రలు చేసి ఎన్జీటీలో కేసులు వేయించడంతో గౌరవెల్లి రిజర్వాయర్ పనులు ముందుకు సాగలేదు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తొలుతలో ఆర్భాటంగా రూ.434కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులతో రెండేండ్లలో కాల్వల నిర్మాణం పూర్తి చేసి హుస్నాబాద్ రైతులకు సాగునీరందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర ద్వారా హుస్నాబాద్‌లో పర్యటించిన అప్పటి పీపీసీ అధ్యక్షుడు, ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి సైతం గౌరవెల్లిని వెంటనే పూర్తి చేసి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, రెండేండ్లు గడిచినా బండ్, పంపుహౌస్, టన్నెల్ మిగులు పనులకు మోక్షం కలుగక పోవడం గమనార్హం.
రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయక పోవడంతో మెట్ట రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేండ్లు గడుస్తున్నా కనీసం భూనిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇన్ని మాటలు చెప్పిన ప్రభుత్వం ప్రాజెక్టుపై ఉన్న ఎన్జీటీ కేసును రద్దు చేయించకపోవడం గమనార్హం. గడిచిన ఏడాదిగా కనీసం గౌరవెల్లి ఊసుకూడా ఎత్తకపోవడంలో ఆంత్యర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టును ముట్టుకోమని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసిందా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కావాల్సింది 590ఎకరాలు గౌరవెల్లి రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో 590 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. గడిచిన రెండేండ్లలో కాంగ్రెస్ సర్కారు కేవలం 200 ఎకరాలు మాత్రమే సేకరించింది. సేకరించిన 200ఎకరాలకు, అవార్డు అయినా రైతులకు చెల్లింపులు కాకపోవడం గమనించాల్సిన విషయం. మిగ తా 390 ఎకరాల భూసేకరణ ఎప్పుడు పూర్తవుతుందో… సాగునీటి సరఫరా ఎప్పు డు అవుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు నిర్వాసితులను రెచ్చగొట్టి ఎన్జీటీ కేసులు వేయించి పనులు జరుగకుండా అడ్డుకున్న నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వాయర్‌ను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం రాకముందు ఒక మాట వచ్చాక మరో మాట లెక్క ఉన్నదని రైతులు చర్చించుకుంటున్నారు.
గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయితే సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోని 1.06లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలమై మరో కోనసీమగా మారే అవకాశం ఉంది. ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా 90వేల ఎకరాలు, ఎడమ కాల్వ ద్వారా 16వేల ఎకరాలకు నీరందే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో 26,710ఎకరాలు, కరీంనగర్ జిల్లా పరిధిలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో 20,634ఎకరాలు, హన్మకొండ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో 12,649ఎకరాలు సాగులోకి వస్తాయి. లక్ష ఎకరాలకు పైగా సాగునీరందించే గౌరవెల్లి రిజర్వాయర్‌ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతన్నలు మండిపడుతున్నారు.
గౌరవెల్లి రిజర్వాయర్ ఎడమ, కుడి కాల్వల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రిజర్వాయర్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో రైతులకు అవగాహన కల్పించి భూములు ఇచ్చేలా చైతన్యం చేస్తున్నాం. మొత్తం 590ఎకరాలకు 200 ఎకరాలు సేకరించాం. ఇందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. కాల్వలకు సంబంధించిన భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావాలి. ప్రభుత్వం అధిక పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. కాల్వల ప్రాంతంలోని రైతులు సహకరించాలి.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభా కర్ ఇచ్చిన హామీ ప్రకా రం ఇప్పటి వరకు గౌర వెల్లి రిజర్వాయర్ కాల్వల భూసే కరణ పూర్తయి నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ప్రభు త్వ నిర్లక్ష్యమో, మంత్రి పట్టింపులేని తనమో కాని రిజ ర్వాయర్, కాల్వల పనులు ఇప్పటికీ మొదలు కాకపోవడం దురదృష్టకరం. గౌరవెల్లి రిజర్వాయ ర్ ఎప్పుడు పూర్తవుతుందా… ఎప్పుడు మా భూముల్లోకి గోదావరి నీళ్లు వస్తాయా…అని ఎదురు చూస్తున్న మెట్ట రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నిరాశనే మిగులుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో రిజర్వాయర్, పంపుహౌస్ పనులు పూర్తి
చేసి భారీ మోటార్ల ద్వారా రిజర్వాయర్‌లో సుమారు టీఎంసీ వరకు నీళ్లు నింపాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేండ్లలో
ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదు. భూనిర్వా సితుల సమస్యలు అలాగే ఉన్నాయి. ఇప్పటికైనా మంత్రి పొన్నం స్పందించాలి.
– వొడితెల సతీశ్‌కుమార్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే