గజ్వేల్, ఏప్రిల్ 19: గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మోడల్ బస్టాండ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభించారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో బస్ వే, బస్టాండ్ల నిర్మాణాలకు అప్పటి సీఎం కేసీఆర్ రూ.6.37కోట్ల నిధులు మంజూరు చేశారు. గజ్వేల్‌లో రెండున్నరేండ్లుగా కొనసాగిన బస్టాండ్ నిర్మాణ పనులు కొద్ది రోజుల క్రితమే పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరగడంతో ప్రయాణికులు రోడ్లపై నిలబడేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తయిన బస్టాండ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులకు కోరుతున్నారు.
నూతన బస్టాండ్‌లో సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, కంట్రోలర్ గదులు నిర్మించారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో బస్టాండ్ నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. దీంతో గత వర్షాకాలంలో ప్రయాణికులు తలదాచుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుతం ఎండలతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గజ్వేల్ పట్టణానికి నిత్యం వేలాదిగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, మహిళలు, వ్యాపారులు, విద్యార్థులు ఆర్టీసీ బస్సులోనే వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్ వద్దకు చేరుకుంటారు.
ప్రయాణికుల కోసం గజ్వేల్ పట్టణంలో రూ.2.56 కోట్లతో మోడల్ బస్టాండ్ నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాంట్రాక్టర్‌కు పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించలేదు. దీంతో పనుల్లో తీవ్ర జాప్యంతో నత్తనడకన జరిగాయి. ఇప్పటికైనా బస్టాండ్లను అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు తొలిగించాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో రూ.3.81కోట్లతో బస్టాండ్ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం బస్టాండ్ స్లాబ్‌లు పూర్తవగా, కొంతమేర గోడలు పూర్తిచేశారు. బస్టాండ్ పనులు పూర్తి కాకపోవడంతో నిత్యం హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, రామగుండం, వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రోడ్లపైనే నిలబడాల్సి వస్తున్నది. సాయంత్రం సమయంలో హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు.
ఇప్పటికైనా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ప్రయాణికులు, గజ్వేల్, ప్రజ్ఞాఫూర్ పట్టణవాసులు కోరుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రజ్ఞాపూర్ బస్టాండ్ పనులను పరిశీలించారు. వెంటనే పనులు పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన చేపతామని ఆయన హెచ్చరించారు.