సిద్దిపేట, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానలో ఉన్న స్టాఫ్ నర్స్‌తో మాట్లాడారు. గత ప్రభుత్వంలో సిద్దిపేటలో నాలుగు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్ నగర్‌లోని బస్తీ దవాఖాన మినహాయించి మిగతా మూడు బస్తీ దవాఖానలు కాళ్లకుంట కాలనీ, లింగారెడ్డిపల్లి, ఆర్అండ్బీ కార్యాలయం సమీపంలోని దవాఖానల్లో ఆరు నెలలుగా వైద్యులు లేక సేవలు అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వైద్యులు లేక, మెడికల్ ఆఫీసర్ రూమ్ పెచ్చులు ఊడిపోయి, డాక్టర్ కూర్చునే కుర్చీలో దుమ్ము పట్టి ఉండటం చూసి ఇదేనా బస్తీ దవాఖాన పనితీరని, వైద్యులు లేకుండా ప్రజలకు వైద్యం ఎలా అందిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పేదల కోసం బీఆర్ఎస్ సర్కారు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే, వాటిని సుస్తీ దవాఖానలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. ఆరు నెలలుగా వైద్యులు రావడం లేదని, అటెండర్‌కు మూడు నెలలుగా వేతనం రావడం లేదన్నారు. స్టాఫ్ నర్స్‌కు నవంబర్ నెల ఇప్పటికీ రాలేదన్నారు. ఈ సందర్భంగా దవాఖానలో మందుల లభ్యత గురించి హరీశ్‌రావు ఆరాతీశారు. మల్టీవిటమిన్, లోప్రైమెడ్ (మోషన్స్ ట్యాబ్లెట్ ), లివో సిట్రిజన్ జలుబు ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ మెటఫిన్తో పాటు ఉండాల్సిన గ్లిమి ఫిరైడ్ 2ఎంజీ లేవని, పిల్లలకు సంబంధించిన జింక్ సల్ఫేట్ అందుబాటులో లేవన్నారు. వైద్యులు లేరని, మందులు లేవని, అలాంటప్పుడు రోగులకు వైద్యసేవలు ఎలా అందుతాయని, పేదలకు అందించే ప్రజా వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని, వెంటనే బస్తీ దవాఖానల్లో వైద్యసిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.