గజ్వేల్, మే 30: కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు మంగళం పలికేందుకు కుట్రలు పన్నుతున్నదని, తద్వారా రైతులపై భారం తప్పదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ రైతులకు ఎలాంటి సమస్య రావద్దనే ఉద్దేశంతో డిస్కంను ఒప్పుకొకుండా తిరస్కరించారని గుర్తుచేశారు. ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే రూ.30వేల కోట్లకు ఆశపడి, రైతులపై పిడుగు పడేలా మోటర్లకు మీటర్ల పెట్టేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొవడంతో రాబోయే రోజుల్లో రైతులపై భారం పడుతుందన్నారు. రైతులు బిల్లులు కట్టలేక అరిగోస పడుతారని, ఎన్ని యూనిట్ల విద్యుత్‌ను కాల్చారో లెక్కించేందుకు ప్రభుత్వం మీటర్ల పెట్టేందుకు సిద్ధమవుతుందని అన్నా రు. బీజేపీ, కాంగ్రెస్‌ల కుట్రలో భాగంగానే రైతులపై భారం మోపుతున్నారని ఆరోపించారు. రైతుబీమా డబ్బులు చెల్లించకపోవడంతో నాలుగు నెలలుగా ప్రమాదాల్లో మృతిచెందిన రైతు కుటుంబాలకు పరిహారం అందడం లేదన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసే కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
ఇంకా ధాన్యం 70 శాతం కొనుగోలు చేయాల్సి ఉందని, జూన్ 4న రాజీవ్ రహదారిని వడ్ల ట్రాక్టర్లతో దిగ్బంధించి ఆందోళన, ధర్నా చేపడుతామని వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్, శ్రీధర్, నాయకులు విరాసత్‌అలీ, రమేష్‌గౌడ్, జకీయోద్ద్దీన్, గోలి సంతోష్, గుంటుక రాజు, కనకసేన, మల్లేశం, స్వామిచారి, వెంకటేష్, కనకయ్య, ప్రతాప్‌రెడ్డి, అశోక్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.