దేశానికే ఆదర్శంగా నిలిచిన ‘మిషన్ భగీరథ’ పథకం పురుడుపోసుకున్న గజ్వేల్ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సరిపడా నీరురాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ వేసవికాలంలోనూ కనిపించని తాగునీటి కష్టాలు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఇక్కడ మొదలయ్యాయి.
గజ్వేల్, మార్చి 30: ముందుచూపుతో కేసీఆర్ మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు నిర్మించి సిద్దిపేట జిల్లాలో సాగు,తాగునీటికి భరోసా కల్పించారు. ఈ రిజర్వాయర్ల నుంచి మిషన్ భగీరథ గ్రిడ్‌కు నీళ్లను తెచ్చి శుద్ధిచేసిన తర్వాత గ్రామాల్లోని ట్యాంకులకు, అక్కడి నుంచి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండంతో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, మర్కూక్, కొండపాక, కుకునూర్‌పల్లి, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో 178 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో మార్చి ప్రారంభం నుంచే తాగునీటి సమస్యలు మొదలయ్యాయి.
గతంలో మాదిరిగా మిషన్ భగీరథ నుంచి సరిపడా నీళ్లు నల్లాల ద్వారా వదలక పోవడంతో ప్రజలకు నీళ్లు సరిపోవడం లేదు. బీఆర్ఎస్ హయాంలో సరిపడా నీటిని సరఫరా చేసేవారు. దీంతో గ్రామాల్లోని బోర్లను వినియోగించే అవసరం లేకుండా పోయింది. దీంతో వాటి వినియోగంలేక అవి పనిచేయకుండా పోయాయి. వాటిని వినియోగంలోకి తీసుకు రావాలంటే నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు రిపేర్ చేయించలేక పోతున్నారు. అధికారులు తాగునీటి సమస్యను గట్టెక్కించకపోతే రాబోయే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు.
నీటి సరఫరాలో అధికారుల విఫలం…
కుకునూర్‌పల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రతి రోజూ నల్లాల ద్వారా వచ్చే మిషన్ భగీరథ నీళ్లు సరిపోక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లకుడారం సమీపంలోని బోరు వద్ద గ్రామస్తులు నీళ్లు తెచ్చుకుంటున్నారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాఫూర్ 3,4,15, 16 వార్డుల్లో తాగునీరు రావడం లేదని గ్రామస్తులు మున్సిపల్ కమిషనర్‌కు నర్సయ్యకు ఇటీవల వినతిపత్రం అందజేశారు. కొద్ది రోజులుగా 11వ వార్డులో తాగునీళ్లు రావడం లేదంటూ కాలనీ వాసులు తెలుపుతున్నారు.
గజ్వేల్ మండలం అహ్మదీపూర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మిషన్ భగీరథ నీళ్లు సరిపడా రాకపోవడంతో బోర్లను ఆశ్రయిస్తున్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో తాగునీటి ట్యాంకు నిర్మాణంలో ఉంది. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొంది. గజ్వేల్ మండలం కోమటిబండ మిషన్ భగీరథ సంప్ నుంచి ప్రతిరోజూ నియోజకవర్గంలోని గ్రామాలకు ఇక్కడి నుంచే శుద్ధిచేసిన నీటిని పంపి ణీ చేస్తారు.
ఇక్కడే ఈ పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించారు. కుకునూర్‌పల్లి మండలం మంగోల్ గ్రిడ్ వద్ద శుద్ధిచేసిన తరువాత నీటిని ఆయా మండలాలకు పంపిణీ చేస్తారు. గజ్వేల్‌లోనే మిషన్ భగీరథ పథ కం పురుడుపోసుకొని ఇతర జిల్లాలకు నీటిని పంపిణీ చేస్తుండగా, గజ్వేల్ ప్రజల దాహార్తి మాత్రం అధికారులు తీర్చడంలో విఫలమత్నురనే విమర్శలు వినిపిస్తున్నాయి.