సిద్దిపేట అర్బన్, మార్చి 23: జీవితం మొదడి అడుగుతోనే ప్రారంభమవుతుందని, ఉద్యో గం చిన్నదా, పెద్దదా అనే అనుమానాలు వద్ద ని, కష్టపడితే విజయం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో మహిళల కోసం నిర్వహించిన జాబ్‌మేళాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టి కష్టపడిన వారు జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారన్నారు. ఇంట్లో ఉంటే పోటీ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేమని, బయటకు వచ్చినప్పుడే ఎదగాలి, పైకి రావాలనే పట్టుదల పెరుగుతుందన్నారు.
ఫాక్స్‌కాన్ కంపెనీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఉత్తమ కంపెనీ అన్నారు. అక్కడ పనిచేసే వారందరూ మహిళలే కాబట్టి రక్షణతో ఉద్యోగ భద్రత ఉంటుందన్నారు. పనిచేసుకుంటూ కూడా చదువుకోవచ్చని, పోటీ పరీక్షలు రాసుకోవచ్చన్నారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఉద్యోగం ఎలాంటిదైనా ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుందన్నారు. 4వేల ఉద్యోగాలు ఉన్నాయని, చాలామంది పోటీ పడుతున్నారని.. కానీ, సిద్దిపేట యువతకు అవకాశం కల్పించాలని కంపెనీ ప్రతినిధులను కోరినట్లు తెలిపారు. గతంలో సిద్దిపేటలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ ఇస్తే 250 మంది కానిస్టేబుళ్లుగా, 33 మంది గ్రూప్స్‌లో ఉద్యోగం సాధించారని హరీశ్‌రావు గుర్తుచేశారు.
మహిళలు తమకు తాము తక్కువ అంచనా వేసుకోకూడదని, మహిళల్లో శక్తి, సామర్థ్యం ఉంటుందని, ఆ శక్తి సామర్థ్యాలను బయటకు తీయాలంటే బయటకు రావాలని, వచ్చి తమ కాళ్లపై తాము నిల్చోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందపి, 15 నెలలు గడుస్తున్నా 7వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కానీ, 57 వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నదని ధ్వజమెత్తారు. అందులో 50 వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి, ఎంపిక చేసిన వారికే నియామక పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,62,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి రూ.2 లక్షల పైన రుణమాఫీ చేసేది లేదని తేల్చి చెప్పారన్నారు. రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకు స్కూటీలు లేవు, తులం బంగారం లేదని ప్రభుత్వ తీరును హరీశ్‌రావు విమర్శించారు. ఎనుముల రేవంత్‌రెడ్డిని నమ్ముకుంటే ప్రజలకు ఎగవేతలు తప్ప ఏమీ మిగలలేదన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. కేసీఆర్ కృషితోనే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించినట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.