చిన్నకోడూరు, ఏప్రిల్ 6: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రైతులకు సాగునీరు అందడం లేదని, కనీసం కాలువలు నిర్మించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై వివక్ష చూపుతున్నదని, ఈ మెగా ప్రాజెక్టును కక్షపూరితంగా ఎండబెడుతున్నదని ఆయన ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం కాలువ నుంచి మైలారం జాలి చెరువు బికబండ కుంటకు సొంత డబ్బులు వెచ్చించి హరీశ్‌రావు ఇటీవల కాలువ తవ్వించారు. ఆదివారం రైతుల సమక్షంలో పైప్‌లైన్ ద్వారా చెరువులోకి ఆయన నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు ఎంతో సంతోషంతో సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మైలారం జాలిచెరువు, కొండెంగులకుంట, బికబండ రైతులకు నీళ్లులేక పంటలు ఎండుతున్నాయని ఇటీవల తనతో మొరపెట్టుకున్నారని, పంటలు ఎండిపోవద్దనే ఉద్దేశంతో తన సొంత డబ్బులతో కాలువ పనులు చేయించానని, భూసేకరణలో నష్టపోతున్న రైతులకు పరిహారం ఇచ్చి కాలువ పనులు చేసినట్లు తెలిపారు. కండ్ల ముందు పంటలు ఎండుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
పిల్ల కాలువలు తవ్వితే ఆయకట్టు పెరుగుతుందని, రైతులకు సాగునీరు అందుతుందని, భూసేకరణ కోసం నిధులు విడుదల చేయాలని శనివారం నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు హరీశ్‌రావు తెలిపారు. అసెంబ్లీలో కట్ మోషన్ ఇచ్చి నిరసన తెలిపామన్నారు. అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని అన్నారు. కాళేశ్వరం నీళ్లు ఉండబట్టే కోకాకోలా ఫ్యాక్టరీ వచ్చినట్టు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కుంగిన ఒకటో రెండో పిల్లర్లను మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు. కాంగ్రెస్ వచ్చాక ఖమ్మంలోని పెద్దవాగు, సుంకిశాల, ఎస్ఎల్బీసీ సొరంగం, వట్టెం ప్రాజెక్టులు కూలియినట్లు గుర్తుచేశారు. కాళేశ్వరం అంటే మెగా ప్రాజెక్టు అన్నారు. కాళేశ్వరం ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇది కేసీఆర్ చేసిన పుణ్యం అన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని కాళేశ్వరం కూలిందని చెప్పడం సరి కాదన్నారు.
సిద్దిపేటనే కాకుండా అనేక నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు అందుతాయని తెలిపారు. ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం ఆపి భూసేకరణ చేసి కాలువలు తవ్వి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మిడ్ మానేరులో నీళ్లు ఉన్నా విడుదల చేయడం లేదన్నారు. కేసీఆర్ కాళేశ్వరం మెగా ప్రాజెక్టు కట్టి, సిస్టం అంతా రెడీ చేసినట్లు తెలిపారు. పంపుహౌస్‌లు, రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ అన్నీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కేవలం భూసేకరణ చేసి కాలువలు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా, అది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదని మండిపడ్డారు.
ఏడాది కాలంలో ఒక ఎకరా కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూసేకరణ చేయకపోవడంతో చాలా చోట్ల రైతులు సొంత డబ్బులు పెట్టుకొని రైతులే స్వచ్ఛందంగా కాలువలు తవ్వుకొని నీళ్లు తీసుకుంటున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, పరకాల మల్లేశం గౌడ్, సత్యనారాయణ రెడ్డి, మేడికాయల వెంకటేశం, పోచబోయిన శ్రీహరి యాదవ్, పెట్టబోయిన శ్రీనివాస్, కాల్వ ఎల్లయ్య, ఏంరెడ్డి భూమిరెడ్డి, జంగిటి శ్రీనివాస్, కొండం రవీందర్ రెడ్డి, ముకెర శ్రీనివాస్, మొండయ్య, రైతులు పాల్గొన్నారు.
నీళ్లు రాకపోతయా అని వరి పంట వేసుకున్న. వరి గింజ దశకు రాగానే నీళ్లకు ఇబ్బంది ఎదురైంది. వరి పంట మీద ఆశలు వదులుకున్నం. కొన్ని రోజుల కిందట హరీశ్‌రావు సార్ మా ఊరికి ఏదో పనిమీద వచ్చిండు. మా గ్రామ పెద్దలతో కలిసి సారుకు జాలి చెరువు బికబండ కొండకు నీళ్లు కావాలని లెటర్ రాసిచ్చినం. హరీశ్‌రావు సార్ ఏమన్నాడంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు అని అన్నడు. మీరు ఏం రంది పడకుర్రి. నేను మీకు నీళ్లు ఇచ్చి తీరుతా అని మాట ఇచ్చిండు. ఆ సార్ సొంత డబ్బులు పెట్టి పైపులైన్ తవ్వించిండు. మా పంటలు ఎండిపోకుండా నీళ్లు ఇచ్చిండు. మాకు ఆయన దేవుడు అయ్యిండు. -తంబాల కనకయ్య,రైతు, కమ్మర్లపల్లి
వాళ్ల గవర్నమెంట్ లేకున్నా మాకు నీళ్లు ఇయ్యాలని తాపత్రయంతో సొంత జేబులో నుంచి ఐదు లక్షల రూపాయలు పెట్టి పైప్‌లైన్ కాలువ తవ్వించి హరీశ్‌రావు సార్ మాకు నీళ్లు ఇచ్చిండు. వరి గింజ కాయ కొంటున్న సమయంలో మాకు నీళ్లు అందడం సంతోషం. రైతులంతా హరీశ్‌రావుకు రుణపడి ఉంటాం.
– రేగుల నరసయ్య, రైతు, కొండెంగలకుంట్ల