సిద్దిపేట, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల ముందు అమలు కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత రైతులకు మెండిచేయి చూపింది. ప్రతి రైతుకు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి ఇప్పుడు రైతులకు ఎగ్గొట్టాడు. దీంతో రైతులు తీసుకున్న పంట రుణాలకు అసలు మిత్తి కలిసి తడిసి మోపెడు అయ్యాయని రైతులు వాపోతున్నారు. ఒకటో విడతలో పంటరుణమాఫీ కాలే.. రెండో, మూడో, నాలుగో విడతలో పంటరుణమాఫీ కాలే.. ఏ విడతలోనూ పంటరుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రెండు లక్షల పంటరుణమాఫీ చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టి రైతులకు మొండి చేయి చూపిందని ప్రభుత్వంపై రైతులు కన్నెర్ర జేస్తుండ్రు. ఎలాంటి షరతులు లేకుండా తమకు పంట రుణమాఫీ చేయాలని రైతులు నినదిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి షరతులు లేకుండా లక్ష వరకు పంటరుణమాఫీ చేసిందని రైతులు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు పెట్టి రైతులను నిలువునా మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత రైతు బంధు ఎగ్గొట్టింది. పంటరుణమాఫీ సక్కగా చేయకపాయే అని రైతులు వాపోతున్నారు.
యాసంగి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రైతులు యాసంగి సాగులో భాగంగా తుకం పోసే పనుల్లో నిమగ్నమయ్యారు. రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండాల్సిన సమయంలో .. సీఎం రేవంత్రెడ్డి తీరుతో రైతుల ఆశలు ఒక్కసారిగా నీరుగారాయి. పంట రుణమాఫీ కాకపాయే, అటు పంట పెట్టుబడి సాయం రాకపాయే అని రైతులు సావుకార్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. పంట రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దోకా చేసిందని రైతులు మండిపడుతున్నారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం రైతులకు పంటరుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుంది కానీ క్షేత్ర స్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది. ఏ గ్రామంలో చూసినా పంటరుణమాఫీ కాని రైతులే కనిపిస్తున్నారు. ప్రభుత్వం రైతులకు పంట రుణమాఫీ ఎగ్గొటిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక కొర్రీలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం లక్ష వరకు పంటరుణమాఫీ చేసింది. అప్పటి ఇప్పటి లెక్కలకు చూసుకుంటే పంటరుణమాఫీ రైతుల సంఖ్యను కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా తగ్గించింది. రెండు లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తే రైతుల సంఖ్య పెరగాలి గానీ తగ్గింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష పంటరుణమాఫీ చేసినప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 4,17,591 మందికి పంటరుణమాఫీ జరిగింది. 2014లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,50,000 మంది రైతులకు రూ.398 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీచేసింది.
2018లో సిద్దిపేట జిల్లాలో 81,565 మందికి రూ. 418 కోట్లు, మెదక్ జిల్లాలో 73,026 మందికి రూ. 366.39 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 1,13,000 మందికి రూ. 678 కోట్లు మాఫీ చేసింది. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షలోపు పంటరుణమాఫీ జరిగింది. మొత్తంగా 4,17,591 మందికి రూ. 1,860. 39 కోట్లు పంటరుణమాఫీ చేసి బీఆర్ఎస్ రైతు ప్రభుత్వమని చెప్పుకుంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల వరకు రైతులకు పంటరుణమాఫీ చేశామని చెప్పుకుంటుంది. మరి వీరు చేసింది ఎంత అంటే 2,85,493 మంది రైతులకు పంటరుణమాఫీ చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 1,32,098 మంది రైతులకు కోత పెట్టింది. రైతుల సంఖ్య పెరగాల్సి ఉండగా పూర్తిగా కోతలు పెట్టింది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు, నా భర్తకు రూ.2 లక్షల పంటరుణమాఫీ కాలేదు. నా పేరు మీద 3.16 ఎకరాల భూమి ఉంటే రూ.1.50 లక్షలు, నా భర్త ర్యాకం బాబు పేరు మీద 2.20 ఎకరాల భూమి ఉంటే రూ1.30 లక్షల పంటరుణాలు తీసుకున్నాం. మేము ఇద్దరం కలిసి బ్యాంకు నుంచి మొత్తం రూ.2.80 లక్షల రుణం పొందాము. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల మాఫీ చేసినట్లు చెప్పుతున్నది కానీ మాకైతే పంటరుణమాఫీ కాలేదు. ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పడం కాదు కనీసం మా ఇద్దరిలో ఒక్కరికైన పంటరుణమాఫీ చేస్తే బాగుంటుంది. సీఎం రేవంత్రెడ్డి సారు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్నట్లుగా ఉన్నది.
-ర్యాకం లక్ష్మి, మహిళా రైతు, మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంటరుణమాఫీకి నేను అర్హుడిని. నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. 2019లో హద్నూర్ కెనరా బ్యాంకులో రూ.1.70 లక్షల పంట రుణం తీసుకున్నా. నాలుగు విడతల వరకు పంటరుణమాఫీ అయితదని ఆశతో ఎదురు చూస్తే నిరాశే మిగిలింది. రూ. రెండు లక్షలలోపు పంటరుణమాఫీ ప్రకటించిన జాబితాలో నా పేరు లేదు. పంటరుణమాఫీ ఎందుకు కాలేదని సంబంధిత బ్యాంకు అధికారులను అడిగిన ఎలాంటి సమాధానం ఇవ్వ లేదు. వ్యవసాయాధికారుల వద్దకు వెళ్తే వస్తాయంటున్నారు. ప్రభుత్వం వందశాతం పంటరుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నది. మా పరిస్థితేమో గిట్ల ఉన్నది.
– ఆశప్ప, రైతు, హద్నూర్, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా