మెదక్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): మెదక్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమంటున్నాయి. బీఆర్ఎస్ నాయకుల వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారు.రాత్రివేళలో గుర్తు తెలియని వ్యక్తులు ముందుగా రెక్కీ నిర్వహించి వాహనాలకు నిప్పంటించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంగళవారం రాత్రి బీఆర్ఎస్ కార్యకర్త హబీబ్‌కు చెందిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి దగ్ధం చేసిన దృశ్యలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నవపేట మల్లారెడ్డి టిప్పుర్ను బాబాకాలనీలో ఉన్న పార్కింగ్‌లో నిలిపి ఉంచాడు. గుర్తు తెలియని వ్యక్తులు టిప్పును దగ్ధం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేసి పోలీస్ కేసులు నమోదు చేయించారు.
కులం పేరుతో దూషించారని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల పై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎస్సీ మహిళతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఎస్సీ మహిళ ఫిర్యాదుతో పాటు ఎమ్మెల్యే వాహనంపై దాడిచేసి హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నం చేశారని మరో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు ఎమ్మెల్యే వాహనం పై దాడి, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా భయంతో వారు పారిపోయారు.
మెదక్ పట్టణంలో ఆటో, టిప్పుర్ను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేసినా బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. గురువారం రాత్రి నవపేట మల్లారెడ్డికి చెందిన టిప్పుర్ను పట్టణంలోని బాబాకాలనీలో నిలిపి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. మల్లారెడ్డి అందుబాటులో లేక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. టిప్పర్ నిలిపిన పార్కింగ్ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నా రాత్రి పని చేయలేదని తెలిసింది. మల్లారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేయగా అరెస్టు చేస్తారనే భయంతో పారిపోయాడు.