చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 1: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఆమె జలాభిషేకం చేసి అమరులకు నివాళులర్పించారు. అనంతరం మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్సై నారాయణగౌడ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్ ఓర్వలేకనే సీబీఐకి అప్పగించిందని మండిపడ్డారు. ఆంధ్రాకు నీళ్లు తరలించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, ఎన్ని కుట్రలు చేసినా రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. 14 ఏండ్లు పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ సాధించారని గుర్తు చేశారు.
పదేండ్లలో కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా ఉంచారన్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45వేల చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయించారన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలు అసెంబ్లీలో చెప్పారన్నారు. కేసీఆర్‌పై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాలతో రైతులకు ఎంతోమేలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు.
పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్, జితేందర్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గంగానరేందర్, మాజీ ఎంపీపీ విజయలక్ష్మి, మాజీ జడ్పీటీసీ ఆంజనేయులు, బీఆర్ఎస్ చిన్నశంకరంపేట మండల అధ్యక్షుడు రాజు, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్, సుజాత, మాజీ సర్పంచ్‌లు కుమార్‌గౌడ్, మైనంపల్లి రంగారావు, లక్ష్మణ్, యాదగిరియాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, పోచయ్య, నాగరాజు, స్వామి, మహిపాల్‌రెడ్డి, సుధాకర్, శ్రీను, మల్లేశ్, చిన్నశంకరంపేట, రామాయంపేట, మెదక్ మండలాల మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.