దుబ్బాక,నవంబర్11: బీఆర్ఎస్ సర్కారులో సమగ్ర కుటుంబ సర్వే చేపడితే విమర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు పేరు మార్చి తిరిగి అదే సర్వే చేపట్టడం విడ్డూరంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్త సీసాలో పాతసారా మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఉందని మండిపడ్డారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తమ ఇంట్లో సమగ్ర కుటుంబ సర్వేకు వచ్చిన అధికారులు, ఉపాధ్యాయులకు వివరాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత కేసీఆర్ సర్కారులో సమగ్ర కుటుంబ సర్వే చేపడితే ..రేవంత్‌రెడ్డి ఎన్నో రకలుగా విమర్శలు చేశారని, దానికి సంబంధించిన నాటి రేవంత్‌రెడ్డి వీడియో క్లిపింగులను విలేకరుల ముందు చూపించారు. గొర్రెలు, బర్రెల వివరాలు ఎందుకు అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ ఎందుకు సర్వే చేయిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా, సర్వే పేరుతో మరోసారి కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ సర్కారు బీసీ,ఎస్సీల్లో కుల చిచ్చుపెడుతుందని మండిపడ్డారు. బీసీ,ఎస్సీలపై చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేపడుతున్న కుటుంబ సమగ్ర సర్వేతో ప్రజలకు ఇబ్బందులు తప్పా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 60 మంది బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అందజేశారు. అనంతరం దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలకు ఆయన హాజరై వారిని ఆశీర్వదించారు. దుబ్బాక 12వ వార్డు కౌన్సిలర్ బట్టు ఎల్లం తండ్రి బాలమల్లు దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు కిషన్‌రెడ్డి, ఎల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, నారాగౌడ్, కౌన్సిలర్లు ఆస యాదగిరి, ఆస స్వామి, ఇల్లేందుల శ్రీనివాస్, దేవుని లలిత, లచ్చయ్య పాల్గొన్నారు.