జహీరాబాద్, జూన్ 23: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూర్ గ్రామంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాకరీలోని యంత్రాలు, పరికరాలను అనుమతి లేకుండా తరలిస్తే సహించేది లేదని ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎంజీ రాములు హెచ్చరించారు. సోమవారం స్థానిక ఫ్యాక్టరీలోని విలువైన యంత్రాలు, పరికరాలను యాజమాన్యం మహారాష్ట్రకు ఎంహెచ్ 46 బీబీ 6651, టీఎస్ 08జేసీ 0833 కంటైనర్లో తరలిస్తుండగా కార్మిక సంఘం నాయకులు, కార్మికులు ఫ్యాక్టరీకి చేరుకుని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడారు.
ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఎన్సీఎల్టీ కోర్టు పరిధిలో ఉందని, ఎలాంటి అనుమతి లేకుండా యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా ఫ్యాక్టరీలో విలువైన పరికరాలను కంటైనర్లో తరలించడంపై మండిపడ్డారు. కోర్టు పరిధిలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి చిన్నముక్కకూడా తరలించేందుకు వీలులేదన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని చెరుకు రైతులకు ఎంతగానో ఉపయోగపడే షుగర్ ఫ్యాక్టరీలోని యంత్రాలు, పరికరాలను తరలిస్తూ కార్మికులను రోడ్డున పడేసేందుకు ప్రయత్నిస్తుండడం సరికాదన్నారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 150 మందికి పైగా ఉన్న కార్మికులకు రూ.7 కోట్లకు పైగా బకాయి వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు.
ఫీఎఫ్ కింద మరో రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉన్నా నేటికీ కార్మికులకు చెల్లించలేదన్నారు. కార్మికులు ఫ్యాక్టరీకి రాకపోవడంతో యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా విలువైన పరికరాలను తరలిస్తుందన్నారు. గత మార్చిలో ఫ్యాక్టరీ చుట్టూ రేకులతో కంచె ఏర్పాటు చేసి, పగటి పూట గ్యాస్ కట్టర్లతో పరికరాలను ముక్కలు ముక్కలు చేసి రాత్రి సమయాల్లో లారీల్లో తరలిస్తుండగా అడ్డుకున్నామన్నారు. అప్పట్లో కార్మికులకు వేతనాలు చెల్లించిన తర్వాతే యంత్రాలు, పరికరాలను తరలిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన ఆర్పీ మంజీత్ భూచ్చ హామీ ఇచ్చారన్నారు.
ఫ్యాక్టరీ నుంచి యంత్రాలు, పరికరాలను తరలిస్తే కార్మికుల కుటుంబాలతో అడ్డుకుంటామని హెచ్చరించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఫ్యాక్టరీ చిన్న ముక్కకూడా తరలించేందుకు వీలు లేదని, కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ యాజమాన్యం ఫ్యాక్టరీని విక్రయించాలనుకుంటే ఫ్యాక్టరీని నడిపించి, క్రషింగ్ చేస్తామనే యాజమాన్యాలకు విక్రయించాలన్నారు.అనంతరం ఫ్యాక్టరీ నుంచి యంత్రాలు, పరికరాలు తరలించేందుకు తీసుకువచ్చిన కంటైనర్లపై జహీరాబాద్ రూరల్ పోలీస్లకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకుని కంటైనర్ను రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు.