ఝరాసంగం, జూన్ 26 : నిమ్జ్ ప్రాజెక్టు పూర్తయితే జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ ప్రాంతాల రూపురేఖలు మారుతాయని, నిమ్జ్ భూములను కోల్పోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో బుధవారం కలెక్టర్ క్రాంతి వల్లూరి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి ఎల్గోయి, ముంగి గ్రామాల 229 మంది భూనిర్వాసితులకు రూ.22.72 కోట్ల పరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నిమ్జ్ కోసం భూములు కోల్పోయిన రైతులకు చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తున్నటుల తెలిపారు. ప్రభుత్వం నిమ్జ్ భూ బాధితులకు అండగా ఉంటుందన్నారు. నిమ్జ్‌లో పెద్ద పరిశ్రమలు ఏర్పాటైతే 3 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. మిగతా భూమిని వేగంగా సేకరించాలని అధికారులనుఆ ఆదేశించా రు. ప్రజలు అభివృద్ధ్దికి సహకరించాలని కోరారు. యువత స్కిల్స్ మెరుగు పరుచుకోవాలన్నారు.
నిర్ణీత గడువులోగా పంట రుణాలు మాఫీ చేస్తామని మంత్రి దామోదర తెలిపారు. నిమ్జ్‌లో భూములు కోల్పోయిన రైతులు దళారులను ఆశ్రయించవద్దని కలెక్టర్ వల్లూరి క్రాంతి రైతులకు సూచించారు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే నిమ్జ్ అధికారులను సంప్రదించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన రోడ్లు, మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులను పున:ప్రారంభించి నియోజకవర్గ అభివృద్ధ్దికి తోడ్పడాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు కోరారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు గతంలో సకాలంలో అందించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అందించాలన్నారు. మిగతా నిమ్జ్ భూనిర్వాసితులకు కూడా పరిహారం అందించి ఆదుకోవాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు నాగలక్ష్మి, రవీందర్‌రెడ్డి, జహీరాబాద్ ఆర్డ్డీవో రాజు, రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జడ్పీటీసీ వినీల నరేశ్, కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్, ఉజ్వల్ రెడ్డి, ఉగ్గెల్లి రాములు, తన్వీర్, హనుమంత్‌రావు పాటిల్, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశం, గుండప్ప, పెంటరెడ్డి . ఎంపీటీసీలు , మాజీ సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గ్గొన్నారు.