పాపన్నపేట, ఆగస్టు 31: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున, ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.25లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డితో కలిసి మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఆమె వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం హెలికాప్టర్ పంపి ఉంటే వారి ప్రాణాలు దక్కేవన్నారు. పాపన్నపేట మండలంలోని చాలా గ్రామాల్లో రైతులు పంట నష్టపోయారని, ఇంతవరకు తహసీల్దార్, ఏఈలు, ఇతర అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పంట రుణమాఫీ కేవలం 40శాతం చేసి చేతులు దులుపుకొందని, రైతుబంధు సైతం నామమాత్రంగా వేశారని, రైతులకు యూరియా కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని డిమాండ్ చేశారు.
అనంతరం కుర్తివాడ, ఎల్లాపూర్, ఆరెపల్లి, మిన్పూర్, ముద్దాపూర్, రామతీర్థం తదితర గ్రామాల్లో పంట నష్టపోయిన పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు.వారి వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు కుమ్మరి జగన్, సోములు, లింగారెడ్డి, కుబేరుడు, బాబాగౌడ్, కృష్ణగౌడ్, సంజీవరెడ్డి, బ్రహ్మం, ఆంటోని, సాయిరెడ్డి ఉన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 31: ఇటీవల భారీ వర్షాలకు నిరాశ్రయులైన మెదక్ జిల్లా హవేళిఘనపూర్ తండావాసులకు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి చేయూతనిచ్చారు. ఆదివారం 70 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపించగా బీఆర్ఎస్ హవేళిఘనపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజులు నీటిలో ఉన్న తండా వాసులకు ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోవడం బాధాకరమన్నారు.
తండావాసుల కష్టాలకు చలించిన పద్మాదేవేందర్‌రెడ్డి గతనెల 29న తండాను సందర్శించి వారు పడుతున్న కష్టాలను తెలుసుకొని చేయూతనందించారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తండావాసులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు యామిరెడ్డి, సిద్ధిరాంరెడ్డి, భిక్షపతిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, అశోక్, మల్లయ్య, రవి, దేవిసింగ్, పెంట్యానాయక్, సురేశ్, నరేశ్, బద్రు ఉన్నారు.