మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 26 : పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని కలెక్టర్లను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్ నుంచి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేసి, ఆదేశాలు జారీ చేశారు. అప్డేట్ చేసిన రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ వివరాలు టీ-పోల్ వెబ్సైట్లో నవీకరించారని కలెక్టర్లను ఆదేశించారు. టీ-పోల్ వెబ్సైట్ ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలన్నారు. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల జాబితా, డిజిటల్ వివరాలను టీ-పోల్‌లో నమోదు చేయాలని, పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, ర్యాంప్, పర్నిచర్, భద్రత ఏర్పాటు చేయాలని, 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో గల భవనం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ కాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలన్నారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు మండల కేంద్రాల్లో ఉండాలని, ఓట్ల లెక్కింపునకు స్ట్రాంగ్ రూమ్‌లను మూడు రోజుల ముందుగా సిద్ధ్దం చేసుకోవాలని సూచించారు. నవంబర్ 27 నుంచి 29 వరకు ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని, పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పక్కాగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాలను జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లాల్లోని ప్రింటర్లు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయకుండా సెక్షన్ 216 టీపీఆర్ చట్టం కఠినంగా అమలు చేయాలన్నారు.
అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్లకు కుముదిని సూచించారు. ప్రతి మండలానికి ఒక ఫ్లయింగ్ స్కాడ్ బృందం, ఒక సహాయ అధికారిని నియమించుకోవాలన్నారు. ప్రతి జిల్లాలో ఎంసీఎంసీ కమిటీ జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రచారంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎంసీఎంసీ అనుమతి ఉండాలన్నారు. తనిఖీల సమయంలో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేస్తే తప్పనిసరిగా రసీదు ఆందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఆదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు తదితరు అధికారులు పాల్గొన్నారు.