గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడాపోటీలు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఆరు విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. నర్సాపూర్, చిలిపిచెడ్, శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, మనోహరాబాద్‌లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మెదక్ జూనియర్ కళాశాలలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రంజోల్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు, భెల్‌లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో పాటు పలుచోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు ‘సీఎం కప్ 2023’ క్రీడలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సత్తా చాటేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను నిర్మించి క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మొదటిరోజు వాలీబాల్,ఫుట్‌బాల్ పోటీలను నిర్వహించగా వివిధ జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
– మెదక్/ సంగారెడ్డి, న్యూస్‌నెట్‌వర్క్, మే 15
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం కప్-2023 క్రీడాపోటీలకు శ్రీకారం చుట్టింది. 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు క్రీడాపోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీలను సోమవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ముందుగా అన్ని మండల కేంద్రాల్లో అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ విభాగాల్లో మండల స్థాయిలో పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలు ఈ నెల 17 వరకు నిర్వహించి, ప్రతిభ కనబర్చిన వారిని జిల్లాస్థాయికి ఎంపిక చేయనున్నారు.
– ఉమ్మడి మెదక్ జిల్లా నెట్వర్క్, మే 15