హత్నూర, సెప్టెంబర్ 12 : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం హత్నూర మండలం గుండ్లమాచునూర్ ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ఉపాధ్యాయులు విద్యార్థులను క్రమశిక్షణతో తీర్చిదిద్దాలన్నారు.
ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులు పట్టు సాధించేలా బోధన చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి చదువులో రాణించేలా కృషి చేయాలని, విద్యార్థులకు అర్థమయ్యే తరహాలో బోధిం చి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో పాఠాలు చదివించారు. ఆంగ్లంలో పాఠాలు చదవడానికి విద్యార్థిని తడబడటంతో ఉపాధ్యాయుడిని పిలిచి ఆంగ్లంలో చదవడం, రాయడంపై పట్టు సాధించేలా కృషి చేయాలన్నారు. పాఠశాలలో సమస్యలు అడిగి తెలుసుకుని, పాఠశాల ఆవరణలో మొక్క లు నాటారు.
కెమికల్ పరిశ్రమలు విడుదల చేసే వాయు కాలుష్యంతో బతకలేకపోతున్నామని గుండ్లమాచునూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్లమాచునూర్ శివారులోని కంది మండలం ఆరట్ల శివారులో సంగారెడ్డి మున్సిపాలిటీ డంప్ యార్డు కోసం స్థల పరిశీలనకు వెళ్లిన కలెక్టర్కు గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ శివారులో ఇప్పటికే నెలకొల్పిన కాలుష్యకారక పరిశ్రమలతో బతకలేకపోతున్నామని, అదిచాలదన్నట్లు సంగారెడ్డి మున్సిపాలిటీ డంప్ యార్డును గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తే ఊరువిడిచి వెళ్లాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామంలో అనేకమంది ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ మనోజ్, మున్సిపాలిటీ కమిషనర్ ప్రసాద్ చౌహాన్, తహసీల్దార్లు ఫర్హీన్ షేక్, విజయలక్ష్మి, ఎంపీడీవో శంకర్, ఎంపీవో యూసూఫ్, ఆర్ఐ శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు.