సంగారెడ్డి కలెక్టరేట్/సిద్దిపేట కలెక్టరేట్, అక్టోబర్ 18: మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పా టు చేసినట్లు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు వల్లూరు క్రాంతి, మనుచౌదరి తెలిపారు. యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జిల్లాల్లో నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లో ప్రవేశాలకు సంబంధించి శుక్రవారం ఆ శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశం అనంతరం సంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ అధికారి రవీందర్‌రెడ్డితో సమావేశమైన కలెక్టర్ ఏటీసీ కేంద్రాల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు.
ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏటీసీ కేంద్రాలపై అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. జిల్లాలో తొలి విడతగా సంగారెడ్డి, హత్నూర ఐటీఐలను గుర్తించి ఏటీసీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోనే ఏటీసీ కేంద్రాలను కొనసాగిస్తూ ఆయా కోర్సుల్లో శిక్షణను ప్రారంభిస్తామన్నారు.
ఈనెల 31 చివరి తేదీ అయినందున అర్హత, ఆసక్తి గల వారు ఏటీసీ కేంద్రంలో నిర్దేశిత కోర్సుల్లో ప్రవేశం పొంది సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సంగారెడ్డి, హత్నూర ఐటీఐలలో ఉదయం 9 నుంచి సా యంత్రం 5 గంటలలోగా అన్ని పనిదినాల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చన్నారు. వివరాలకు సంగారెడ్డి ప్రిన్సిపాల్‌ను 9848935146, హత్నూర ప్రిన్సిపాల్‌ను 9963004960 ంబర్లపై సంప్రదించాలని సూచించారు.
సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ..ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి ఫేజ్‌లో కుకునూర్‌పల్లి ఐటీఐని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్‌గా మార్చి నూతనంగా ఆరు అధునాతన కోర్సులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఏటీసీ కేంద్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ పర్యవేక్షణకు డీఆర్డీవోను ప్రత్యేక నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. జిల్లాలో నిర్దేశిత లక్ష్యం 172 మంది విద్యార్థులను ఏటీసీ కేంద్రాల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కుకునూర్‌పల్లి ఏటీసీ ప్రిన్సిపాల్ వెంకటరమణను కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఉపాధికల్పన అధికారి రాఘవేందర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.