సంగారెడ్డి జిల్లా అధికారులు, మండల అధికారులతో సమావేశాలు
సందర్శకులతో సందడిగా మారిన కలెక్టరేట్ ప్రాంగణం
తొలి రోజు విధుల్లో బిజీ బిజీగా నూతన కలెక్టర్
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 17 : సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ శరత్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 10.05 గంటలకు జిల్లా కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు జిల్లాలోకి ప్రవేశించిన నూతన కలెక్టర్ పటాన్చెరు మండలంలోని ప్రముఖ వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డాక్టర్ శరత్ ఇప్పటి వరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌గా ఆయన్ను బదిలీ చేస్తూ ఆదివారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన హనుమంతరావు పంచాయతీశాఖ సంచాలకుడిగా బదిలీపై వెళ్లారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి నుంచి ఆయన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి వీరారెడ్డి నూతన కలెక్టర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. పూలమొక్కను అందజేస్తూ కలెక్టరేట్‌లోకి ఆహ్వానించారు.
సందడిగా మారిన కలెక్టరేట్ ప్రాంగణం
నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శరత్‌ను కలిసేందుకు ప్రముఖులు క్యూ కట్టారు. జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి స్వర్ణలత, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు, జిల్లా పశుసంవర్ధ్దక శాఖ అధికారి వసంతకుమారి, వివిధ శాఖల అధికారులు, ఆయా డివిజన్ల ఆర్డీవోలు, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారిగా ఆయా శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేర్వేరుగా ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అలసత్వం తగదన్నారు. ఈ సమావేశంలో ఆయాశాఖల జిల్లా అధికారులు, డీఎల్పీవోలు పాల్గొన్నారు.