మెదక్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : రహదారులు చకగా ఉంటేనే రవాణా రంగం అభివృద్ధి చెందుతుందని, దూర భారం తగ్గి ప్రయాణికులు సుఖమయ ప్రయాణం చేయొచ్చని, ఆదిశగా ప్రభుత్వం రహదారుల నిర్మాణం, పునరుద్ధ్దరణకు నిధులు కేటాయించిందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం తన చాంబర్లో రహదారులు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపడుతున్న పలు రహదారుల నిర్మాణాలు, బీటీ రోడ్ల పునరుద్ధరణ పనులపై ఆయా ఇంజినీరింగ్ అధికారులు, ఏజెన్సీలతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్ల మహర్దశకు ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసిందన్నారు. గ్రామీణ రోడ్ల నిర్వహణలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా గతేడాది, ప్రస్తుత ఆర్థ్ధిక సంవత్సరంలో ఎస్డీఎఫ్, ఎఫ్డీఆర్ నిధుల కింద అందోల్, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నారాయణఖేడ్, నర్సాపూర్ నియోజక వర్గాల్లో రూ.156 కోట్ల 762 లక్షల అంచనా ఖర్చుతో 178 బీటీ రోడ్ల పునరుద్ధ్దరణ పనులు పూర్తిచేయడం లక్ష్యం కాగా, కొన్ని పనులు మాత్రమే గ్రౌండ్ అయ్యాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఏజెన్సీలు పనులు చేపట్టేందుకు ముందుకు రావాలని, జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారమందిస్తామన్నారు. మెదక్ రీజియన్లో 72 కిలో మీటర్ల మేర వరదల వల్ల దెబ్బ తిన్న రోడ్లు, బీటీ రోడ్ల పునరుద్ధణ వంటి 43 పనులను రూ.49 కోట్ల వ్యయంతో చేపడుతున్నామని టెండర్లు వేయుటకు ఏజెన్సీలు ముందుకు రావాలని కోరారు.
రహదారులు, భవనాల శాఖ ద్వారా చేపడుతున్న పనులను సమీక్షిస్తూ, గతేడాది రూ.16 కోట్ల 71 లక్షల ఖర్చుతో 46.39 కిలో మీటర్ల బీటీ రోడ్డు పునరుద్ధరణకు చేపట్టిన 9 పనులు, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 47 కోట్ల 68 లక్షల వ్యయంతో 87.51 కిలో మీటర్ల మేర రోడ్డు పునరుద్ధరణ చేపట్టిన 15 పనులకు సంబంధించి టెం డర్లు పూర్తయిన వాటికి వెంటనే బీటీ రోడ్డు రెన్యువల్ పనులు చేపట్టాలని సూచించారు. టెండరు దశ, అగ్రిమెంట్ పూర్తి కాని, వాటిపై తగు చర్యలు తీసుకొని త్వరితగతిన పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఈఈ సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ ఈఈ పాండురంగారెడ్డి, రహదారులు, భవనాల డిప్యూ టీ ఈఈ వెంకటేశం, ఇంజినీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు నరసింహరెడ్డి, వెంకట్రెడ్డి, ఎల్లారెడ్డి, మల్లేశం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.