రామాయంపేట, మార్చి 23: మెదక్ జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదివారం ఉదయం తన సతీమణితో కలిసి మెదక్ జిల్లా కేంద్రం నుంచి సైకిల్‌పై బయలుదేరి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాయంపేట పట్టణానికి చేరుకున్నారు. స్థానిక బస్టాండ్‌ను సందర్శించి ప్రయాణికులతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో నిలిచి ఉన్న బస్సు ఎక్కి ప్రయాణికులతో ముచ్చటించారు. మహిళా ప్రయాణికులతో మాట్లాడి మహాలక్ష్మి పథకం అమలు గురించి ఆరా తీశారు.
మహిళలు మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామాయంపేట బస్టాండ్‌ను త్వరలోనే ఆధునీకరిస్తామని తెలిపారు. సమస్యలన్నీ పరిష్కరించాలని ఆర్టీసీ డీఎం సురేఖను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం తన సతీమణితో కలిసి బస్సులో టికెట్ తీసుకుని కలెక్టర్ రాహుల్‌రాజ్ మెదక్‌కు ప్రయాణించారు. కొద్దిరోజులు క్రితం కలెక్టర్ దంపతులు పొలాలను సందర్శించి మహిళా రైతులతో కలిసి వరినాట్లు వేశారు. ప్రతి ఆదివారం ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ కలెక్టర్ రాహుల్‌రాజ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.