నర్సాపూర్, మే 25: మండలంలోని రెడ్డిపల్లి కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశలో ఉన్నదని, త్వరితగతిన కేంద్రంలోని ధాన్యాన్ని రైస్‌మిల్లులకు వెంటవెంటనే తరలించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. శనివారం మండలంలోని రెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయని, గత సీజన్లో 1,51,609.960 టన్నుల ధాన్యం కొన్నట్లు తెలిపారు.
జిల్లాలోని 410 కేంద్రాల్లో 5 మాత్రమే ధాన్యం కొనుగోలు పూర్తి చేశాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 410 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 2,40,908.080 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.382.43 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 163 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందన్నారు. మెదక్ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లాకు 10 వేల మెట్రిక్ టన్నులు, మహబూబ్‌నగర్ జిల్లాకు 40 వేల మెట్రిక్ టన్నులు, జోగులాంబ గద్వాల్‌కు 10 వేల మెట్రిక్ టన్నులు తరలించేందుకు ఆర్డర్ వచ్చిందన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి తదితరులు ఉన్నారు.
నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ రాహుల్‌రాజ్ శనివారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా హాళ్లను, మూడంచెల భద్రత పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌తో ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి ఉన్నారు.
– పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు
కొల్చారం, మే 25: రంగంపేటలో ఇప్పటివరకు 70 వేల బస్తాల ధాన్యం కొన్నట్లు తెలిపారు. మరో 5 వేల బస్తాల ధాన్యం కొనుగోలు రెండు రోజుల్లో పూర్తవుతుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు తెలిపారు. శనివారం మండలంలోని రంగంపేట సొసైటీ పరిధిలోని ధాన్యం కొలుగోలు కేంద్రాన్ని సందర్శించారు. సొసైటీ రికార్డులు పరిశీలించారు. చైర్మన్ అరిగె రమేశ్, సీఈవో నవీన్‌ను ధాన్యం కొనుగోలుపై అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి మిల్లులకు ధాన్యం సరఫరా పూర్తవడంతో మిగులు ధాన్యాన్ని గద్వాల, మహబూబ్ నగర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
తూప్రాన్, మే 25: డివిజన్లో 3.82 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తూప్రాన్ ఆర్డీవో ఎం.జయచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఉమ్మడి తూప్రాన్ మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. మండలంలోని రావెళ్లి, వెంకటరత్నాపూర్, మనోహరాబాద్ మండలంలోని కూచారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యం మిల్లర్లకు చేరవేయడంతోపాటు వారి నుంచి వస్తున్న ఇబ్బందులపై కేంద్ర నిర్వాహకులకు సూచనలు, సలహాలు చేశారు.
కొనుగోలు కేంద్రాల పరిశీలన
పెద్దశంకరంపేట, మే 25: మండలంలోని రామోజిపల్లి, వీరోజిపల్లి, కొత్తపేట, పెద్దశంకరంపేట తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం తహసీల్దార్ గ్రేసీబాయి తనిఖీ చేశారు.