మెదక్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : మెదక్ కలెక్టరేట్లో నిఘా పెరిగింది. కలెక్టరేట్లోని అన్నిశాఖల అధికారులు, సిబ్బంది ఇక నుంచి ఆలస్యంగా విధులకు వస్తే వేటు పడనున్నది. ఇక నుంచి ప్రతి ఉద్యోగి సమయ పాలన పాటించాలి, లేదంటే సీసీ కెమెరాలకు చిక్కుతారు. మెదక్ కలెక్టరేట్లోని సుమారు 50 శాఖల్లో 160 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో కలెక్టరేట్ మొత్తం సీసీ కెమెరాల నిఘాలోకి వచ్చేసింది. వీటి పర్యవేక్షణకు కలెక్టర్ ఛాంబర్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రతి కదలికపై చర్యలు తీసుకోనున్నారు. కలెక్టరేట్‌తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
మెదక్ కలెక్టరేట్లోని అన్ని సెక్షన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా సిబ్బంది పనితీరు మెరుగుపర్చడంతో పాటు కలెక్టరేట్‌లోకి తరుచూ ఎవరూ వస్తున్నారు. వచ్చిన వారు ఏ సెక్షన్లోకి వెళ్తున్నారు. ఆ సెక్షన్లో ఎవరిని ఎక్కువగా కలుస్తున్నారన్న దానిపై కూడా యం త్రాంగం ప్రత్యేక దృష్టి సారించనున్నది. కలెక్టరేట్‌కు ప్రతిరోజు వచ్చే వారి కదలికలపై కూడా నిఘా పెట్టనున్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఉన్న సమయంలో విజిటర్స్ తాకిడి ఎక్కువగా ఉంటున్నది. కలెక్టర్‌ను కలిసేందుకు ఎవరు వస్తున్నారన్నది కూడా సీసీ కెమెరాల ద్వారా స్పష్టంగా తెలుస్త్తుంది. కలెక్టరేట్ కారిడార్‌లో ఎవరు తిరుగుతున్నా కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుంది. 160 సీసీ కెమెరాలతో కలెక్టరేట్లో నిఘా ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్కరి కదలికను తెలుసుకోనున్నారు.
మెదక్ కలెక్టరేట్లో ఏ నుంచి హెచ్ వరకు సెక్షన్లు ఉన్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఈ సెక్షన్లలో పనిచేసే వారు మరింత అలర్ట్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్లో ప్రతి సెక్షన్ కీలకమైనదే. ప్రతి సెక్షన్లో సంబంధిత సూపరింటెండెంట్‌తో పాటు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా పరిపాలనా యంత్రాంగానికే గుండెకాయ అయిన కలెక్టరేట్ పనితీరును మరింత మెరుగుపరిచి ఇతర శాఖలకు ఆదర్శంగా ఉంచేందుకు కలెక్టర్ రాహుల్‌రాజు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ జిల్లాలో తొలిసారిగా కలెక్టరేట్ నుంచే ఈ- ఆఫీస్ విధానాన్ని ప్రారంభించారు. ఈ-ఆఫీస్ అమల్లోకి వచ్చిన తర్వాత కలెక్టరేట్లోని ప్రతి సెక్షన్‌కు సంబంధించిన ఫైళ్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరుగెత్తిస్తున్నారు.కలెక్టరేట్లోని ప్రతి సెక్షన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో అక్కడ పనిచేసే సిబ్బంది మరింత అప్రమత్తం కానున్నారు.
కలెక్టరేట్లోని అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు శాఖల పనితీరు మెరుగుపర్చడానికే 160 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. అన్ని సెక్షన్లలో సీసీటీవీల ఏర్పాటు చేశాం. కలెక్టరేట్లో సీసీటీవీల సర్వేలెన్స్ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షిస్తాం. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండలాల్లోని పీహెచ్‌సీలు, కమ్యూనిటీ సెంటర్స్, ఏరియా దవాఖానల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదు.
-రాహుల్‌రాజ్, కలెక్టర్ మెదక్