Collector Rahul Raj | వెల్దుర్తి, మార్చి 05 : విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన మాసాయిపేట ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ పాఠశాలలు అమలు చేస్తున్న ఏఐ విద్యాబోధనను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఏఐ పాఠాలను విన్న కలెక్టర్, విధ్యా బోధనపై విద్యార్థులకు పలు విషయాలను వివరించి, అవగాహన కల్పించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటగా ఆరు ప్రాథమిక పాఠశాలలో ఏఐ విద్యాబోధన అమలు చేయడం జరుగుతుందని, ఇందులో తెలుగు, ఇంగ్లీష్ చదవడం, రాయడంతో పాటు మాట్లాడడం, గణితంలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడంతో తప్పొప్పులను సరిచేయడం జరుగుతుందన్నారు. ఏఐ విద్యాబోదన సత్ఫలితాలను ఇస్తుందని వచ్చే ఏడాది మరిన్ని పాఠశాలలో అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రాథమిక బోధనను సాధారణ, సరళమైన పద్దతిలో అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా మొదటగా కలెక్టర్ పాఠశాలకు వచ్చిన సందర్భంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సంబంధిత అధికారులకు ఫోన్ చేసిన కలెక్టర్ విద్యుత్ అంతరాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పాఠశాలకు మళ్లీ వస్తానని అంతలోపు విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలని సూచించి వెళ్లిపోయిన కలెక్టర్ కొద్ది సేపటి తరువాత పాఠశాలకు వచ్చి ఏఐ బోధనను పరిశీలించారు.
చిన్నారులకు మెరుగైన బోజనాన్ని మెనుప్రకారం అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. పాఠశాల పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పాఠశాలలో చిన్నారులకు అందిస్తున్న మధ్యాహ్నా భోజనాన్ని, వంటసామాగ్రి, పప్పు దినుసులను పరిశీలించారు. చిన్నారులతో పాటు గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించాలని, తరగతి గదులు చిన్నారులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. చిన్నారులకు ఆట వస్తువులు, బొమ్మలను పాఠశాలలో ఉంచాలని, భోజనానికి నాణ్యమైన వస్తువులను మాత్రమే వాడాలన్నారు. చిన్నారుల తల్లిదండ్రులతో నెలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల వివరాలను ఆరోగ్య స్థితిని వివరించాలన్నారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ జ్ఞానజ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.