మెదక్ రూరల్ సెప్టెంబర్ 05 : వినాయక నవరాత్రుల అనంతరం శోభయాత్ర నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలందరూ సమన్వయంతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం మెదక్ మండలం కొంటూర్ వద్ద వినాయక నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన కమాట్లాడుతూ గణేష్ ఉత్సవ కమిటీల సహకారంతో క్రమశిక్షణను పాటిస్తూ 9 రోజులపాటు జిల్లాలో గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకున్నారని, గణేష్ శోభాయాత్రతో పాటు, నిమజ్జనాన్ని కూడా ఇదేవిధంగా కొనసాగించాలని కోరారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గణేష్ శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో రూట్ మ్యాప్ రూపొందించామన్నారు. గణేష్ నిమజ్జనం ఊరేగింపులోని నిమజ్జన ప్రదేశాల్లో ప్రత్యేకించి యువకులు ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దని కోరారు. ప్రతి ఒక్కరు చెడు అలవాట్లను మానుకొని మన పూర్వీకులు ఇచ్చిన ఆదర్శాలు, సందేశాల స్ఫురణతో నిమజ్జనంలో పాల్గొనాలని, ఒక సంకల్ప దీక్షతో అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.