నర్సాపూర్, ఏప్రిల్ 6: సంక్షోభ సమయం మన పనితీరుకు పరీక్ష అని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శనివారం మండలపరిధిలోని లింగాపూర్, రుస్తుంపేట్ గ్రామాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో నీటి ఇబ్బందులను అధిగమించాలని, శుద్ధిచేసిన నీటిని సరఫరా చేయాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో చివరి నివాసప్రాంతం వరకు నీరుచేరేలా చూడాలన్నారు. స్థానికంగా ఉన్న నీటి వనరులను వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయ ఆధారిత బోర్‌వెల్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించి సిద్ధం చేసుకోవాలన్నారు.
మిషన్ భగీరథలో అందుబాటులో ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది షిప్టులవారీగా 24 గంటలు పనిచేస్తూ డిమాండ్ మేరకు అవసరమైన నీరు గ్రామీణ ప్రాంతాలకు చేరేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం లింగాపూర్, రుస్తుంపేట్ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి తాగునీటిపై ఆరాతీసి సంతృప్తి వ్యక్తం చేశారు. మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ అధికారులు, పంచాయతీ అభివృద్ది అధికారులు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో ప్రతిరోజూ పర్యటించి సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ కమలాకర్, ఇంట్రా ఈఈ సంపత్‌కుమార్, ఎంపీడీవో మధులత, అధికారులు పాల్గొన్నారు.