మెదక్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా దవాఖానను బుధవారం కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. మెడికల్ స్టోర్ రూమ్‌ను పరిశీలించి మందుల వివరాలను పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల వైద్యులు సమన్వయంతో పనిచేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. దవాఖానల్లో ల్యాబ్‌లు 24 గంటలు పనిచేసి రోగులకు ఫలితాలు వేగంగా అందించాలన్నారు. సరిపడా పరీక్షల కిట్లు, మందు లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని అధికారులకు ఆయన సూచించారు. సమీక్షలో డీఎంహెచ్‌వో శ్రీరామ్, జిల్లాదవాఖాన సూపరింటెండెంట్ శివదయాళ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.