కౌడిపల్లి, నవంబర్ 18: వరి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మహమ్మద్‌నగర్‌లోని శ్రీ సాయి ఆగ్రో ఇండస్ట్రీస్‌లో తనిఖీ చేశారు.
రైస్‌మిల్లుకు ధాన్యంలోడ్‌తో వచ్చిన లారీలను వెంటవెంటనే దింపుకొనేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. రైస్‌మిల్లులో ఎంతవరకు ధాన్యం నిలువ చేసేందుకు స్థలం ఉందని, అన్ని ధాన్యం బస్తాలు దించుకోవాలని సూచించారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. సన్న వడ్లను త్వరగా సేకరించాలని రైతులు కలెక్టర్‌ను కోరగా, త్వరలో వ్యవసాయ అధికారులతో మాట్లాడి ధాన్యం సేకరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.