మెదక్ మున్సిపాలిటీ, మే 4 ప్రజారోగ్య పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోనాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రం మెదక్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది హాజరు రిజిష్టర్లతో పాటు ఓపీ రిజిష్టర్, ఔషధాల నిల్వల రిజిష్టర్‌ను సైతం పరిశీలించారు.
వైద్య సిబ్బందితో మాట్లాడి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. వేసవి దృష్ట్యా దవాఖానలలో సరిపడే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబా టులో ఉంచాలన్నారు. ముఖ్యంగా సాధారణ ప్రసవాలను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ఆరోగ్య కేంద్రంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా అవగాహన కల్పిలంచాలని సూచించారు.