మెదక్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): వరద బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని, వరదలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, చెరువులకు మరమ్మతులు చేస్తున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. హవేళీఘనపూర్ మండలంలోని బూరుగుపల్లి, వాడి బ్రిడ్జి, కప్రాయపల్లి, ధూప్ సింగ్ తండాలో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలు, వంతెనలను శనివారం కలెక్టర్ పరిశీలించారు. తాతాలిక మరమ్మతులు చేస్తూ రవాణాను పునరుద్ధరిస్తున్నామని, పంట నష్టంపై అధికారులు అంచనాలు వేస్తున్నారని తెలిపారు.
నాలుగు కిలోమీటర్లు బైక్పై ప్రయాణించి దెబ్బతిన్న రోడ్లను, పంట పొలాలను, వంతెనలను కలెక్టర్ పరిశీలించి పీఆర్, వ్యవసాయ అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. జిల్లాలో 50 ఏండ్లలో ఎన్నడూ చూడలేదని ప్రకృతి విలయతాండవం చవి చూడడం జరిగిందన్నారు. ప్రస్తుతానికి సింగిల్ ఫేస్ విద్యుత్ పునరుద్ధరించామని, మిగతా సహాయ చర్యలపై దృష్టి సారించామన్నారు.
దురదృష్టవశాత్తు ఇద్దరు వ్యక్తులు చనిపోవడం బాధాకరమైన సంఘటన అని కలెక్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద మంజీరా నదికి విడుదల చేస్తున్నందున నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అధికారులందరూ క్షేత్రస్థాయి పర్యటనల్లో ఉన్నందున సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి హెల్ప్డెస్ ద్వారా మాత్రమే అర్జీలు స్వీకరిస్తామని, ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ రాహుల్రాజ్ కోరారు.