నర్సాపూర్,జూన్ 28: ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు సూచించారు. శనివారం ఉదయం ఆరు గంటలకు ఆయన మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో మున్సిపల్ సిబ్బందితో కలిసి విస్తృతంగా పర్యటించారు. వార్డుల్లో పర్యటిస్తూ శానిటైజేషన్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, పట్టణ ప్రజలకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
వైన్స్దుకాణాల నిర్వాహకులు షాపులముందు విచ్చలవిడిగా ప్లాస్టిక్ పారవేయడంపై రూ.5 వేలు జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతలో మున్సిపల్ సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఇంటింటికీ చెత్త బండి వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను వేరే చేసి ఇవ్వాలన్నారు.
మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న స్థలాల్లో చెత్త వేయరాదని, తప్పకుండా మున్సిపల్ సిబ్బందికి అందించాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా నర్సాపూర్ మున్సిపాలిటీని తీర్చిదిద్దేలాగా ప్రజ లు, అధికారులు భాగస్వాములుకావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ అనేది వైన్స్ షాపుల నుంచే ప్రారంభం కావాలన్నారు. వార్డుల్లో ఉన్న సమస్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.