రామాయంపేట, నవంబర్ 27: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులకు సూచించారు. బుధవారం మెదక్ జిల్లాలో ఆయన పర్యటించారు. రామాయంపేట ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి కుటుంబ సమగ్ర సర్వే ఆన్లైన్ డాటాను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోషల్ వెల్ఫేర్ కళాశాలలో వంట గదులు, అక్కన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేలో 55వేల కుటుంబాల సర్వే పూర్తి చేసి డాటాను ఆన్లైన్ కంప్యూటరీకరణ చేశామన్నారు. డాటాలో ఏమైనా పొరపాట్లు జరిగితే వాటికి బాధ్యత ఎన్యూమరేటర్లదేనని సృష్టం చేశారు. కుటుంబ సర్వే డాటాను గోప్యతగా ఉంచాలని కంప్యూటర్ ఆపరేటర్లకు సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో లక్షా 73వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ట్యాబ్, ఎంట్రీస్, ట్రక్‌షీట్, జనరేట్ మిల్లర్ల రసీదును తొందరగా పూర్తి చేసుకోవాలన్నారు. ట్యాబ్ ఎంట్రీలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ఇవన్నీ పూర్తి చేసిన ధాన్యానికి ప్రభుత్వం ద్వారా త్వరగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. తెలంగాణ గురుకుల సోషల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులకు మెను ప్రకారం భోజనం పెట్టాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్ర మంలో తహసీల్దార్ రజినీకుమారి, ఎంపీడీవో షాజులుద్దీన్, ప్రిన్సిపాల్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
రేగోడ్/చౌటకూర్/ నిజాంపేట, నవంబర్ 27: ఈనెలాఖరు వరకు సమగ్ర కుటుంబ సర్వే ఆన్లైన్ పూర్తి చేయాలని ఆర్డీవో రమాదేవి సిబ్బందికి సూచించారు. రేగోడ్ ఎంపీడీవో కార్యాలయాన్ని ఆమె సందర్శించి కులగణన సర్వే రిపోర్టు ఆన్లైన్ డాటా ఎంట్రీని త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఎస్ఎస్ఆర్, ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు.
కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ నరేశ్,ఎంపీడీవో సీతారావమ్మ, సూపరింటెండెంట్ రమేశ్, ఆర్ఐ ఫిరోజ్, డాటా ఎంట్రీ సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు చౌటకూర్ మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, నిజాంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న డాటా ఎంట్రీలను అందోల్-జోగిపేట ఆర్డీవో పాండు, జడ్పీ సీఈవో ఎల్లయ్య పరిశీలించారు. వారి వెంట జోగిపేట మున్సిపల్ కమిషనర్ సీహెచ్ పాండు, డిప్యూటీ తహసీల్దార్ మధుకర్‌రెడ్డి, శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ వినయ్, డాటా ఎంట్రీ సూపర్వైజర్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో రాజిరెడ్డి, సిబ్బంది ఉన్నారు.