మెదక్ మున్సిపాలిటీ, జూలై 13: కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. పిల్లల మధ్య అంతరం పాటించడం వల్ల తల్లీ శిశువుల ఆరోగ్యం బాగుంటుందన్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించారు.
అంతకుముందు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గణేశ్వర్ మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 18 వరకు కుటుంబ నియంత్రణ పద్ధతులు, ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించిన కుటుంబాలను కలెక్టర్ అభినందించి శాలువాలతో సన్మానించారు. ఈకార్యక్రమంలో మెదక్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జయశ్రీ, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.