చౌటకూర్, మే 8: పశుసంపద అత్యంత కీలకమని, పాల ఉత్పత్తి లేకుంటే మనుగడ కష్టమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సరాఫ్పల్లిలో పశు వైద్య, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ నందికంటి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు.
పశుసంపద పెంపుపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు ప్యాకెట్ పాలకు అలవాటు పడ్డారని, ఇంటికో పాడి గేదె ఉండేలా చొరవ చూపాలని సూచించారు. ఇంట్లో పాడి గేదెలు ఉండటం ద్వారా పాలు, పెరుగు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులు లభ్యమవుతాయన్నారు. పాడి గేదెల ద్వారా ఇంటి అవసరాలు తీరడమే కాకుండా రోజూ ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వమే ఉచితంగా పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తుందన్నారు. పశువైద్యాధికారులు వారానికి, పక్షం రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి పశువుల ఆరోగ్యం, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారన్నారు. మేలుజాతి దూడలను ఎంచుకుని పశుసంపదను అభివృద్ధి చేసుకోవాలన్నారు.
కోర్పోలులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరాఫ్పల్లికి కలెక్టర్ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కోర్పోలు రైతులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని, రోజుల తరబడి ధాన్యం రాశులు అలాగే ఉండిపోయాయని చెప్పడంతో సరాఫ్పల్లి నుంచి కలెక్టర్ కోర్పోలుకు వెళ్లారు. డీసీఎంస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రంలో సమయానికి తూకం వేయడం లేదని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
14 మంది హమాలీలు ఉన్నారని, హమాలీల కొరత కారణంగా కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని నిర్వాహకులు వివరించారు. కలెక్టర్ వెంట బుచ్చుగూడెం సర్పంచ్ సునీతాప్రవీణ్రెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్ ఉన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ వసంతకుమారి, డీఏవో శివప్రసాద్, డీసీవో కిరణ్ కుమార్, తహసీల్దార్ కిష్టయ్య, ఏవో ప్రవీణ, ఆరో ప్రమోద్‌కుమార్, ఎంపీవో సువర్ణ, పశువైద్యాధికారి విశాల్, గోపాలమిత్ర పర్యవేక్షకుడు అర్జునయ్య, మత్స్యశాఖ అధ్యక్షుడు వెంకటేశం, మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్, విజయ డెయిరీ ఇన్చారి మేనేజర్ నిఖిత, సిబ్బంది శంకర్, ప్రభాకర్ పాల్గొన్నారు.