సిద్దిపేట కలెక్టరేట్, ఆగస్టు 31: భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం రెవె న్యూ, పంచాయతీ, ఇరిగేషన్, పోలీస్, వైద్యారోగ్యశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భం గా మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా సంబంధితశాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. లోలెవల్ వంతెనలు, కల్వర్టుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 2200 చెరువులు, కుంటలు ఉన్నాయని, వాటిలో ఇప్పటికే 600 చెరువులు పూర్తిగా నిండాయన్నారు. రాత్రి వర్షం కురిస్తే చెరువులు, కుంట లు తెగిపోయే అవకాశం ఉన్నందున ప్రమాదకరమైన చెరువులు, కుంటలను గుర్తించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు గరిమాఅగర్వాల్, శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మల్లారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.